శనివారం 30 మే 2020
Telangana - May 04, 2020 , 01:04:07

చిన్నారికి కేటీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌

చిన్నారికి కేటీఆర్‌ బర్త్‌డే గిఫ్ట్‌

  • దుస్తులు, స్వీట్లు, బొమ్మలు అందజేత
  • బాలుడి తల్లి ట్వీట్‌కు స్పందించిన మంత్రి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌తో కొడుకు ఫస్ట్‌ బర్త్‌డేను జరుపలేకపోతున్నామని తల్లిదండ్రులు ఇంట్లో దిగులుగా కూర్చున్నారు.. కనీసం కొత్త బట్టలైనా వేయలేకపోతున్నామనే బాధను బయటపెట్టలేక కుమిలిపోతున్నారు. కానీ.. కొద్దిసేపటికే ఆ బాధ మాయమై ఆనందం వెల్లివిరిసింది. ఆదివారం మోగిన కాలింగ్‌బెల్‌తో డోర్‌ తెరిచి చూడగా పోలీసులు తీసుకొచ్చిన ఊహించని గిఫ్ట్‌లు వారి ముఖాల్లో వెలుగులు నింపాయి. ఓ చిన్నారి మొదటి బర్త్‌డేకు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఊహించని గిఫ్ట్‌ ఇచ్చారు. 

లాక్‌డౌన్‌లో కొత్త బట్టలు, స్వీట్లు, బొమ్మలు ఇంటికి పంపారు. ‘మే 5న నా కుమారుడి మొదటి పుట్టినరోజు. లాక్‌డౌన్‌తో కనీసం కొత్త డ్రెస్‌ కూడా కొనుక్కోలేకపోతున్నాం. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఇలాంటి వేడుకకు సాయంచేయాలి’ అని హైదరాబాద్‌కు చెందిన దివ్యారావు అనే మహిళ ఈ నెల 2న ట్విట్టర్‌లో మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్‌.. కార్యాలయ సిబ్బంది ద్వారా బాబుకు డ్రెస్సులు, స్వీట్లు, బొమ్మలు పంపించారు. వీటిని పోలీసు సిబ్బంది ఆదివారం దివ్యారావు కుటుంబసభ్యులకు అందించారు. 

ఊహించని స్పందనతో వారు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘మొదటి జన్మదినం ఘనంగా చేసుకోలేకపోతున్నామని చాలా బాధపడ్డాం. అయితే ఊహించని విధంగా మీరు పంపించిన గిఫ్ట్‌లు అందాయి. ఇప్పుడు కొత్త అనుభూతితో పుట్టినరోజు నిర్వహించుకుంటున్నాం’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘వీటిని మా కార్యాలయ సిబ్బంది సమకూర్చారు. బాబుకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్‌ మరో ట్వీట్‌ చేశారు.


logo