మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 28, 2020 , 01:37:02

డిజిటల్‌దే భవిష్యత్తు

డిజిటల్‌దే భవిష్యత్తు

  • ఆ దిశగానే దేశాల అడుగులు
  • కరోనా సంక్షోభం అనంతరం పారిశ్రామికంగా అవకాశాలు
  • ఇంటింటికీ ఇంటర్నెట్‌తో విప్లవాత్మకమైన మార్పులు
  • వ్యవసాయానికీ ప్రాధాన్యం
  • ఈ ఏడాది 36% పెరిగిన సాగు 
  • సీఐఐ వర్చువల్‌ సదస్సులో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత పారిశ్రామికరంగంలో అనేక అవకాశాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రపంచంలోని అనేక ఆకర్షణీయమైన పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా మారిందని తెలిపారు. గురువారం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘కొవిడ్‌ అనంతరం తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై వర్చువల్‌ సదస్సు నిర్వహించారు. ఇందులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సంక్షోభం తర్వాత చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. ప్రస్తుత సంక్షోభం కారణంగా ప్రపంచం డిజిటలైజేషన్‌ వైపు వెళ్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అనుసరించడంలో ముందువరుసలో ఉన్నదన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే పనులు చురుకుగా సాగుతున్నాయని, దీనితో విద్య, వైద్యం వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు. అవి డిజిటల్‌ విప్లవం వైపు తెలంగాణను తీసుకెళ్లగలవని విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారికి తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పారు. 

14 రంగాల్లో పెట్టుబడులు లక్ష్యం

తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యరంగాలను ఎంచుకొని వాటిలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆయారంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేవారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. హైదరాబాద్‌ను స్టార్టప్‌ క్యాపిటల్‌గా తయారుచేసేందుకు ఐదేండ్లుగా అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. టీ హబ్‌ ఏర్పాటు ఇండియన్‌ స్టార్టప్‌ ఎకో సిస్టంలో గొప్ప మార్పునకు కారణమైందన్నారు. దీనితో అనేక స్టార్టప్‌లు గొప్ప ప్రగతిని సాధించాయని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా వీహబ్‌ ఏర్పాటు చేశామన్నారు. భారీస్థాయిలో పారిశ్రామికపార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు. ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్‌ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్‌ హైదరాబాద్‌ ఫార్మాసిటీ, దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌, అతిపెద్ద మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ వంటివి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.  

అన్ని రంగాల్లో ఉన్నత ప్రమాణాలు

తెలంగాణ ఏర్పడిన నాటినుంచి పోలిస్తే విద్యుత్‌ సరఫరాలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామికరంగాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణకే కాకుండా వ్యవసాయరంగానికి సైతం పెద్దఎత్తున ప్రాధాన్యం ఇచ్చామన్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు రైతుబంధు, రైతు బీమా, రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందన్నారు. తెలంగాణ పథకాలతో దేశంలోనే అత్యధికంగా సాగు నమోదైందన్నారు. గతేడాదితో పోల్చితే 36% సాగు విస్తీర్ణం పెరిగిందని వివరించారు. అనంతరం సీఐఐ రూపొందించిన నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధి ప్రణాళికను విడుదల చేశారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, రెడ్డీస్‌ ల్యాబ్‌ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo