బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 12, 2020 , 02:47:02

హైస్కూల్‌ నుంచే వ్యాపార కోణం

హైస్కూల్‌ నుంచే వ్యాపార కోణం

  • అది ఉన్నప్పుడే ఉద్యోగాలిచ్చే హోదా.. ప్రపంచానికే ఆదర్శం మన స్టార్టప్‌లు
  • వ్యవసాయ రంగంలో అవకాశాలు: ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌
  • సీఐఐ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైస్కూల్‌ స్థాయిలోనే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు కల్పించేస్థాయికి చేరుకొంటారని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ అద్భుతంగా పనిచేస్తున్నదని చెప్పారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ సహకారంతో భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటుచేసిన సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌ను మంత్రి కేటీఆర్‌ వెబినార్‌ ద్వారా ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ దేశాభివృద్ధిలో స్టార్టప్‌ల పాత్ర ప్రముఖమైనదని తెలిపారు. ఇక్కడి స్టార్టప్‌లు ప్రపంచంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నాయని, ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ అనుబంధరంగాల్లో స్టార్టప్‌లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని, మంచి వృద్ధి సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌ కావాలని పిలుపునిచ్చారని, స్టార్టప్‌లు లేకుండా ఆత్మనిర్భర్‌ భారత్‌ అసాధ్యమని స్పష్టంచేశారు. స్టార్టప్‌లకు అవసరమైన ఏకో సిస్టం ఉండాలని, దీనికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ చాలా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 

తెలంగాణలో స్టార్టప్‌ ఏకో సిస్టం దేశంలోనే టాప్‌-3లో ఒకటిగా ఉంటుందని ఆయన దీమా వ్యక్తంచేశారు. ఇక్కడ అనేక ఇంక్యుబెటర్లు, కోవర్క్‌ స్పేస్‌లు, యాక్సిలేటర్లు ఉన్నాయని, స్టార్టప్‌లకు మెంటర్స్‌, అడ్వయిజర్స్‌, ఇన్వెస్టర్స్‌, వెంచర్‌ ఫండ్స్‌ అనేకం దీనికి ముడిపడి ఉంటాయని చెప్పారు. ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, స్టార్టప్‌లకు సీఐఐ ఏర్పాటుచేసిన ఇన్నోవేషన్‌, ఎంటర్‌ప్రైన్యూర్‌షిప్‌ అండ్‌ స్టార్టప్స్‌ సెంటర్‌ మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో శానిటేషన్‌ హబ్‌ (ఎస్‌ హబ్‌ ) ఏర్పాటుచేస్తున్నామని, మరికొద్ది నెలల్లో దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైప్‌ సెంటర్‌ టీవర్క్స్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. 


హైదరాబాద్‌ నుంచే కరోనా వ్యాక్సిన్‌

కరోనా కష్టకాలంలో స్టార్టప్‌ల సహకారంతో ఇక్కడ వెంటిలేటర్‌ను తయారుచేశామని, దవాఖానలు దీనిని పరీక్షించాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనుగొనడానికి దేశంనుంచి ఆరు సంస్థలు పోటీపడుతుంటే.. ఇందులో నాలుగు సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్నవేనని ఆయన పేర్కొన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ ఇక్కడినుంచే వస్తుందని దీమా వ్యక్తంచేశారు. ప్రపంచానికి అవసరమైన 35-40 శాతం వరకు ఫార్మా, వ్యాక్సిన్లు ఇక్కడ తయారై ఎగుమతి అవుతున్నాయని, లైఫ్‌ సైన్సెస్‌కు ఇక్కడ అనుకూల వాతావరణం ఉన్నదని చెప్పారు. 

ఐటీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించినట్టుగానే దశాబ్దకాలంలో వైద్యరంగంలోనూ లభించబోతున్నాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో అద్భుతమైన అవకాశాలున్నాయని తెలిపారు. ఐటీ, హెల్త్‌ కేర్‌ రెండు కలిసి ప్రపంచంలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. నోవార్టిస్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉన్నదని, రెండో పెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసి 5వేలమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, సీఐఐ స్టార్టప్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ క్రిష్‌ గోపాలక్రిష్ణన్‌, సీఐఐ డీజీ చంద్రజిత్‌ బెనర్జీ, టీహబ్‌ సీఈవో రవినారాయణ్‌, సీఐఐ నేషనల్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ సభ్యుడు బీవీఆర్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాంధీకి వైరస్‌ పనిపట్టే రోబో

  • మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా అందించిన రీవాక్స్‌ ఫార్మా 

హైదరాబాద్‌లోని రీవాక్స్‌ ఫార్మా సంస్థ గాంధీ దవాఖానకు యూవీ రోవా బీఆర్‌ అనే మొబైల్‌ ర్యాపిడ్‌ వైరస్‌ డిస్‌ఇన్‌ఫెక్షన్‌ రోబోను ఉచితంగా అందించింది. శనివారం ప్రగతిభవన్‌లో రూ.12 లక్షల విలువైన రోబోను సామాజిక బాధ్యత కింద ఆ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ద్వారా గాంధీ దవాఖానకు అందించారు. రోబోతో మానవుల ప్రమేయం లేకుం డా దవాఖానలోని కొవిడ్‌ గదులను, ఇతర ప్రాంతాలను శుభ్రం చేసుకోవచ్చు. చిన్న బటన్‌ నొక్కడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఏ గదిలో అవసరమో అక్కడపెట్టి బటన్‌ నొక్కిన ఐదు నిమిషాల్లో వైరస్హ్రితం చేస్తుంది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌, కంపెనీ చైర్మన్‌ మోహన్‌తయాల్‌, డైరెక్టర్‌ జగన్నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo