బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:33:52

అర్చకోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

అర్చకోద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి 

సూర్యాపేట టౌన్‌: అర్చక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లా అర్చక ఉద్యోగుల జేఏసీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన వలివేటి వీరభద్రశర్మను ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అనేక దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోక మూతపడే పరిస్థితికి చేరుకోగా.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ చొరవ తీసుకొని నిధులు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. 

అర్చక ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇటీవల కన్నుమూసిన అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించింది. ఈ సమావేశంలో జేఏసీ సభ్యులు గంగు ఉపేంద్రశర్మ, కనకంభట్ల వెంకటేశ్వర శర్మ, చిన్నం మోహన్‌, దౌలతాబాద్‌ వాసుదేవశర్మ, రామలింగేశ్వర శర్మ, కృష్ణమాచార్యులు, పెన్నా మోహన్‌శర్మ పాల్గొన్నారు.