సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 03, 2020 , 01:53:59

ప్రతి ఎకరాకూ కాళేశ్వరం జలాలు

ప్రతి ఎకరాకూ కాళేశ్వరం జలాలు
  • ఎస్సారెస్పీ రెండోదశ పనులపై సమీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జల సంకల్పంలో భాగం గా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీ ఆయకట్టులోని చివరిభూమి వరకు పుష్కలంగా సాగునీరు అందించామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి చెప్పారు. సీఎం కృషివల్లనే సూర్యాపేటకు గోదావరిజలాలు అందాయని తెలిపారు. ఎస్సారెస్పీ రెండోదశ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు 69-71 కింద జరుగుతున్న మరమ్మతుపనులపై మంత్రి సోమవారం సమీక్ష నిర్వహంచారు. ఈ సమీక్షలో తుంగతుర్తి ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌, నీటిపారుదల శాఖ ఈఎన్సీ నాగేంద్రరావు, ఎస్‌ఈ సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ కాల్వల మరమ్మతులు త్వరితగతిన పూర్తిచేసి వర్షాకాలంలో విడుదలచేసే గోదావరిజలాలు చివరిదాకా పోతాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరిజలాలను అందించడంతో సూర్యాపేట జిల్లాలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఇందుకు సూర్యాపేట జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారన్నారు. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలు సూర్యాపేటకొస్తే సన్యాసం తీసుకుంటానని ఒక ప్రతిపక్ష నాయకుడుఅన్నారని గుర్తుచేశారు.  డిమాండుకు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు.  


logo