మంగళవారం 02 జూన్ 2020
Telangana - Jan 29, 2020 , 01:58:57

దిగజారుతున్న ఉత్తమ్‌ మానసికస్థితి

దిగజారుతున్న ఉత్తమ్‌ మానసికస్థితి
  • కోమటిరెడ్డి బ్రదర్స్‌ మాదిరిగానే ప్రవర్తిస్తున్నాడు
  • విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శ

నల్లగొండ ప్రధానప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో ఘోర పరాభవం తట్టుకోలేక ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించా రు. వారి పాత పద్ధతుల్లో యాదగిరిగుట్టలో మహిళా ఎమ్మెల్యే గొంగిడి సునీతపై, నేరేడుచర్లలో ఎమ్మెల్యే సైదిరెడ్డిపై, చౌటుప్పల్‌లో ఇతర పార్టీల నాయకులు, కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి జిమ్మిక్కులు, భౌతిక దాడులు చేశారని విమర్శించారు. 


నల్లగొండ జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గతంలో కోమటిరెడ్డి సోదరుల మతిస్థిమితం మాత్రమే అనుమానంగా ఉండేదని.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మానసికస్థితిలోనూ మార్పు కనిపిస్తున్నదని అన్నారు. నేరేడుచర్లలో మరోసారి భంగపాటుకు గురైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన స్థాయిని మరిచి అధికారులను బూతులు తిట్టారని, రికార్డులున్నా వాటిని బయటపెట్టే నీచస్థితిలో తాము లేమన్నారు. తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తే.. ఆంధ్రా ఎంపీ కాళ్లు పట్టుకొని మద్దతు కోసం తీసుకొచ్చుకునే స్థితికి పీసీసీ చీఫ్‌ దిగజారారని మంత్రి విమర్శించారు. ఆంధ్రా ఎంపీని తన పక్కన కూర్చోబెట్టుకొని.. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరేడుచర్లలో ఓటు ఎలా కల్పిస్తారని ఉత్తమ్‌ ప్రశ్నించడాన్ని ఏమనాలని మంత్రి ప్రశ్నించారు. 


ఎక్స్‌ అఫీషియో ఓట్లను ఉపయోగించే చట్టం తెచ్చిందే కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆయన గుర్తుచేశారు. ఉత్తమ్‌ మానసికస్థితి మరింత దిగజారక ముందే ఆ పార్టీ కార్యకర్తలు, కుటుంబసభ్యులు దవాఖానలో చూపించాలని సలహా ఇచ్చారు. పల్లెల తరహాలో పట్టణ ప్రగతిని కోరుకునే ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు 18 మున్సిపాలిటీలకు 17 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని,  పల్లెలకు మించి పట్టణాల్లో మరింతగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి సోదరులకు ప్రజలు కర్రు కాల్చి మళ్లీ వాత పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నల్లగొండ, నకిరేకల్‌ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌ వలీ తదితరులు పాల్గొన్నారు.


logo