గురువారం 28 మే 2020
Telangana - May 05, 2020 , 00:48:31

ఉనికి కోసమే ఉత్తమ్‌ ఆరోపణలు

ఉనికి కోసమే ఉత్తమ్‌ ఆరోపణలు

  • కరోనాపై అర్థంలేని వ్యాఖ్యలతో అభాసుపాలు
  • పీసీసీ నేతపై మండిపడ్డ మంత్రి  జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రతినిధి/హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అధికార పార్టీపై ఆడిపోసుకునేందుకు అవకాశం వెతుక్కుంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉనికి కోసం ఉత్తుత్తి ఆరోపణలుచేస్తూ ప్రజల్లో మరింత అభాసుపాలవుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లాలో కరోనా పరీక్షలు చేయడం లేదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ విమర్శించడంపై మంత్రి ఘాటుగా స్పందించారు. సోమవారం సూర్యాపేటలో మాట్లాడుతూ.. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా అధికారులు పనిచేస్తూ పాజిటివ్‌ కేసుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులతోపాటు అనుమానితులందరినీ గుర్తించి పరీక్షలు చేస్తున్నారని స్పష్టంచేశారు. 

అనుమానితులు ఉన్నా, ఒకవేళ ఎక్కడైనా పరీక్షలు చేయాలని నిర్దేశిత ప్రాంతాన్ని ఉత్తమ్‌ గుర్తించినా తేల్చి చెప్పాలి తప్ప.. అర్థంలేని వ్యాఖ్యలు చేయొద్దని హితవుపలికారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు చేప ట్టి, జిల్లాలను అప్రమత్తంచేసి పకడ్బందీ లాక్‌డౌన్‌ ద్వారా వైరస్‌ను నియంత్రించగలిగిందని అన్నారు. నిరుపేదలకు ఇప్పటికే ఉచితంగా బియ్యం, నగదు అందించి, వలస కూలీలను సైతం ఆదుకున్నదని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం కొని రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. 

కాంగ్రెస్‌ మొసలి కన్నీరు: మారెడ్డి


మద్దతు ధర అందిస్తూ ధాన్యం కొనుగోళ్లను సజావుగా సాగిస్తుంటే కాంగ్రెస్‌ నేతలు రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దీక్షల పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం పౌరసరఫరాల భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఉనికి కోసమే బీజేపీ, కాంగ్రెస్‌ నేతల విమర్శలని, వారి ఆరోపణలను ప్రజలు ఎవ్వరూ నమ్మరని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ధర్నాలు చేశారని, గన్నీ సంచులు, యూరియా కోసం లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తుచేశారు. తాలు పేరు తో ధాన్యంలో ఇష్టమొచ్చినట్టు కోత విధిస్తే రైసు మిల్లులను బ్లాక్‌లిస్టులో పెడుతామని శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. 


logo