సోమవారం 01 జూన్ 2020
Telangana - May 14, 2020 , 22:06:46

విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు

 విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు

నల్లగొండ: ‘కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం జరుగనివ్వం... విపక్షాల బానిస మనస్తత్వం మాకు తెలుసు.. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు రాష్ర్టాల్లో రెండు మాటలు మాట్లాడుతూ ద్వంద వైఖరి తీసుకున్నాయి’ అని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.  నల్లగొండ జిల్లాకేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ తీసుకువచ్చిన 203జీఓపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించిందని, కృష్ణా ట్రిబ్యునల్‌, అపెక్స్‌ కమిటీకి కూడా నివేదించామని తెలిపారు.

 త్వరలోనే సుప్రీం కోర్టుకు వెళ్తామని, కేసీఆర్‌ బతికి ఉండగా రైతులకు అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇప్పుడు మాట్లాడే నేతల సాక్షిగానే తెలంగాణకు ద్రోహం జరిగిందని మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు స్పష్టమైన వైఖరి లేకుండా రెండు రాష్ర్టాల్లో రెండు వైఖరి ప్రదర్శించడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆ రెండు పార్టీల ఏపీ, తెలంగాణ అధ్యక్షులు విరుద్ధమైన ప్రకటనలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాలో వృథాగా పోతున్న గోదావరి జలాలు ఎలా వాడుకోవాలో చెప్పడంతో పాటు ఇరు రాష్ర్టాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని గుర్తు చేశారు.

 విపక్షాల మాదిరిగా డ్రామాలు చేయడం తమకు, తమ పార్టీకి, ప్రభుత్వానికి తెలియదన్నారు. ‘మాకు ఆంధ్రాలో శాఖలు లేవు.. మీకు ఉన్నాయి.. అందుకే ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు.. మూడు వందల కేసులు వేసి కాళేశ్వరం ఆపే ప్రయత్నాలు చేసిన మీరు ఇప్పుడు సుద్దులు చెప్తున్నారా..?’ అని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులనుద్దేశించి అన్నారు. ‘మీ బానిస మనస్తత్వం మాకు తెలుసు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్‌ దేశంలో ఉన్న నదులను సముద్రంలో కలువకుండా ఎలా చేయాలో చెప్పగలిగారని ఇందుకు తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులే నిదర్శనం.. ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణానదిపై అక్రమ ప్రాజెక్టులు రానియ్యం’ అని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.logo