సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 15:15:04

ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్‌

ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్‌

హైద‌రాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే భ‌ట్టి విక్ర‌మార్క‌పై విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ సంద‌ర్భంగా భ‌ట్టి విక్ర‌మార్క‌పై మంత్రి మండిప‌డ్డారు. గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో విద్యుత్ రంగంలో ఉన్న‌ది ఉన్న‌ట్టే చెప్పాం.. అబ‌ద్ధాలు మాత్రం చెప్ప‌లేదు. రాష్ర్టం ఏర్ప‌డే కంటే ముందు 7 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. రాష్ర్టం ఏర్ప‌డ్డాక అది 17 వేల మెగావాట్ల‌కు చేరింద‌ని చెప్పాం. తామేం త‌ప్పు చెప్ప‌లేదు అని మంత్రి స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ 2 నుంచి 4 గంట‌ల పాటు క‌రెంట్ క‌ట్ చేసేవారు. గ్రామాల్లో 6 నుంచి 8 గంట‌ల పాటు క‌రెంట్ తీసేవారు. రైతాంగానికి 3 గంట‌ల‌కు మించి క‌రెంట్ ఇవ్వ‌లేదు. ఇవ‌న్నీ మీ హ‌యాంలో జ‌రిగిన‌వి కాబ‌ట్టే చెప్పాం. మా హయాంలో ఏం జ‌రిగిందో చెప్పామ‌ని మంత్రి పేర్కొన్నారు.

మీరు ప్రారంభించిన ప్రాజెక్టుల్లో ఏ ప‌ని కూడా పూర్తి కాలేదు. మీరు 10 నుంచి 30 శాతం ప‌నులు పూర్తి చేస్తే.. త‌మ ప్ర‌భుత్వం 100 శాతం ప‌నులు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. పులిచింత‌ల‌, కేటీపీపీ స్టేజ్ 2తో పాటు ఎస్ఈపీపీ సింగ‌రేణి ప్రాజెక్టును తామే పూర్తి చేశామని మంత్రి స్ప‌ష్టం చేశారు. భ‌ద్రాద్రి ప్రాజెక్టును త్వ‌ర‌లోనే పూర్తి చేస్తామ‌న్నారు. ఎన్జీటీ కేసు వ‌ల్లే ఆల‌స్య‌మైంద‌న్నారు.

మీరు విద్యుత్ రంగంలో చ‌ర్య‌లు తీసుకుంటే రైతులు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు? మీరు అన్ని ప‌నులు చేస్తే తెలంగాణ రాక ముందు చీక‌ట్లు ఎందుకు? అని ప్ర‌శ్నించారు. ప‌రిశ్ర‌మ‌లు ఎందుకు మూత‌ప‌డ్డాయి? రైతాంగానికి 24 గంట‌ల ఉచిత‌, నాణ్య‌మైన క‌రెంట్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ అని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలైన పంజాబ్‌, రాజ‌స్థాన్‌లో 24 గంట‌ల క‌రెంట్ ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చాక రైతుల‌కు క‌రెంట్ స‌మ‌స్య‌లు తొల‌గినాయి. ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయ‌ని మంత్రి పేర్కొన్నారు.  విద్యుత్ స‌మ‌స్య‌ను మూడేళ్ల‌లో స‌రిచేసిన నాయ‌కుడు కేసీఆర్ అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి గుర్తు చేశారు. 


logo