బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 02:52:01

సంతోష్‌ జ్ఞాపక చిహ్నంగా కేసారం

సంతోష్‌ జ్ఞాపక చిహ్నంగా కేసారం

  • సూర్యాపేటలో కూడలికి కర్నల్‌ పేరు
  • విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ: అమరవీరుడి అంత్యక్రియలు జరిగిన సూర్యాపేట సమీపంలోని కేసారంను సంతోష్‌బాబు జ్ఞాపకచిహ్నంగా మారుస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం హైదరాబాద్‌కు చేరుకున్న సమయం నుంచి అంత్యక్రియల వరకు అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి దగ్గరుండి పర్యవేక్షించారు. అంతిమసంస్కారాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కేసారం గ్రామాన్ని సంతోష్‌కుమార్‌ జ్ఞాపకచిహ్నంగా అభివృద్ధి చేస్తామని చెప్పా రు. 

సూర్యాపేట జిల్లాకేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్‌బాబు పేరు పెడుతామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు సందేశం పంపించారని వెల్లడించారు. వారు ఏది కోరుకున్నా ప్రభుత్వం తరఫున చేస్తామన్నారు. సంతోష్‌ దేశం కోసం ప్రాణాలర్పించడం గర్వంగా ఉన్నదని ఆయ న భార్య సంతోషితోపాటు తల్లిదండ్రులు చెప్పడం.. యువతలో దేశభక్తిని మరింత రగిల్చిందని మంత్రి కొనియాడారు. కర్నల్‌ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు.


logo