శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 03:00:15

నీళ్లసారూ.. నిన్ను మరువలేం

నీళ్లసారూ.. నిన్ను మరువలేం

  • విద్యాసాగర్‌రావు విగ్రహావిష్కరణలో మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నీటిరంగ నిపుణులు, ఇంజినీర్‌ ఆర్‌ విద్యాసాగర్‌రావు తెలంగాణకు అందించిన సేవలు మరువలేనివని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కొనియాడారు. ఏటా నవంబర్‌ 14న విద్యాసాగర్‌రావు జయంతి రోజున తెలంగాణ ఇంజినీర్స్‌ డేగా ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని జలసౌధలో శనివారం నిర్వహించిన వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇంజినీర్స్‌ భవన్‌లో ఏర్పాటుచేసిన విద్యాసాగర్‌రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నీటి వాటాలో జరుగుతున్న అన్యాయాన్ని విద్యాసాగర్‌రావు లెక్కలతో సహా బయటపెట్టి.. నీళ్ల సారుగా పేరొందారని గుర్తుచేశారు. 

తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ఉద్యమ కాలంలో అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు. ఆయన సేవలను గుర్తించే.. ప్రత్యేక రాష్ట్రంలో విద్యాసాగర్‌రావును ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్‌ నియమించి సముచిత స్థానం కల్పించారని చెప్పారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక సూచనలు చేశారన్నారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పలువురు ఇంజినీర్లను మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో సాగునీటిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ డాక్టర్‌ రజత్‌కుమార్‌, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, హైదరాబాద్‌ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ ఇరిగేషన్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్ల సంఘం, తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ, తెలంగాణ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల సంఘం, విద్యాసాగర్‌రావు ఇంజినీర్స్‌ భవన్‌ కమిటీ నాయకులు, అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.

ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నీటి వాటాలో జరుగుతున్న అన్యాయాన్ని విద్యాసాగర్‌రావు లెక్కలతో సహా బయటపెట్టి.. నీళ్ల సారుగా పేరుపొందారు. తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ఉద్యమ కాలంలో అవిశ్రాంతంగా పోరాడారు. అనేక ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక సూచనలు చేశారు.

- జగదీశ్‌రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి