సోమవారం 28 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:28:37

ఆరేండ్లలో అద్భుతాలు

ఆరేండ్లలో అద్భుతాలు

  • ఆరు నెలల్లోనే కోతల నుంచి నిరంతర సరఫరా
  • 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్న ఒకే రాష్ట్రం
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనాదక్షతకు 
  • విద్యుత్‌ రంగమే ఓ మంచి ఉదాహరణ
  • lకేంద్ర విద్యుత్‌ చట్టంతో రాష్ర్టానికి పెద్ద దెబ్బ
  • శ్రీశైలం ప్రమాదంపై విచారణ తర్వాత వివరాలు
  • విద్యుత్‌శాఖపై లఘు చర్చలో మంత్రి జగదీశ్‌రెడ్డి

రాష్ట్రం గత ఆరేండ్లలో విద్యుత్‌ కష్టాలను అధిగమించి, రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్‌ ఇచ్చే స్థాయికి ఎదగడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలనా దక్షతకు నిదర్శనమని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సమైక్యపాలనలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్‌ వ్యవస్థను సరిచేసి మిగులు దిశగా రాష్ర్టాన్ని తీసుకెళుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో రాష్ర్టాల హక్కులను హరించేలా కేంద్ర ప్రతిపాదించిన నూతన విద్యుత్‌ బిల్లు తెలంగాణకు గొడ్డలిపెట్టులా మారబోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  తెలంగాణ రాష్ట్రం ఆరేండ్లలో అద్భుతాలు సృష్టించిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం ‘తెలంగాణలో విద్యుత్‌ విజయాలు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన విద్యుత్‌ బిల్లు, శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో సంభవించిన ప్రమాదం’ అంశాలపై లఘుచర్చను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడేనాటికి ఉన్న తీవ్ర విద్యుత్‌ సంక్షోభాన్ని ప్రభుత్వం అత్యంత విజయవంతంగా పరిష్కరించిందని మంత్రి చెప్పారు.రాష్ట్రాన్ని విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కించడాన్ని సవాల్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి.. తన ప్రణాళికలు, దార్శనికతతో భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను వేగంగా పూర్తిచేశారని, రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల నుంచే, అంటే 2014 నవంబర్‌ 20 నుంచి కోతల్లేని కరెంటు సరఫరా అవుతున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడేనాటికి 7,778 మెగావాట్లు ఉన్న స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఇప్పుడు 15,888 మెగావాట్లకు చేరిందని వివరించారు. ‘71 మెగావాట్లుగా ఉన్న సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ఈ రోజు 3,725 మెగావాట్లకు పెరిగింది. దేశంలోనే అత్యధిక సౌరవిద్యుత్‌ సామర్థ్యం కలిగిన నాలుగో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది’ అని చెప్పారు. కొత్త పవర్‌ ప్లాంట్ల ద్వారా మొత్తం 11,715 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం రాష్ర్టానికి సమకూరనున్నదని, అప్పుడు 27,603 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారుతుందని వివరించారు.

రాష్ట్ర ప్రయోజనాలకు కొత్త విద్యుత్‌ చట్టం పెద్ద దెబ్బ

విద్యుత్‌ చట్టం- 2003కు సవరణలతో కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద దెబ్బ అని మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఈ  చట్టంతో రైతులు, పేదలతో సహా ఎవరికీ ఎలాంటి సబ్సిడీలు అందించడం కుదరదని తెలిపారు. విద్యుత్‌ సంస్థల్లో ప్రైవేటురంగానికి ఇది దొడ్డిదారి వంటిదని విమర్శించారు.  

సంస్థ ఆస్తులు కాపాడి వారు చిరస్మరణీయులయ్యారు

శ్రీశైలం జల విద్యుత్‌ కేంద్రంలో అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని మంత్రి అన్నారు. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘వారి కుటుంబాలను సాధ్యమైనంత మేర ఆదుకొనేందుకు ప్రభుత్వం ఉదార నిర్ణయం తీసుకున్నది. మరణించిన డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, ఇతర ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది’ అని తెలిపారు. అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణతోపాటు శాఖాపరంగా నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తున్నదని చెప్పారు. విచారణ ముగిసిన తర్వాతే వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం కలుగుతుందన్నారు. మండలిలో కూడా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి ఇదే సమాధానం ఇచ్చారు.

సీఎం సాబ్‌ ఆప్‌ ఆగేబడో.. 

  • హమ్‌ తుమ్హారే సాత్‌ హై: గంప గోవర్ధన్‌  

 రాష్ట్రాల ప్రయోజనాలు హరించేందుకే నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ధ్వజమెత్తారు. మంగళవారం అసెంబ్లీలో విద్యుత్‌ అంశంపై లఘు చర్చలో ఆయన పాల్గొంటూ.. కేంద్రం తెస్తున్న కొత్త చట్టం రాష్ట్ర విద్యుత్‌ రంగానికి మరణశాసనం వంటిదని, దీన్ని అందరూ వ్యతిరేకించాలని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై అందరినీ ఏకం చేసేలా కేసీఆర్‌ కృషి చేయాలని కోరారు. ‘సీఎం సాబ్‌ ఆప్‌ ఆగేబడో.. హమ్‌ తుమ్హారే సాత్‌ హై..’ అని చెప్పారు. కొత్త చట్టంతో మోదీ సర్కార్‌ దేశవ్యాప్తంగా ప్రైవేటు కంపెనీలకు తలుపులు  బార్లా తీయబోతున్నదని, విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం తప్ప కేంద్రం లక్ష్యం మరేం కాదన్నారు. 

కొత్త విద్యుత్‌ చట్టంపై చర్చ జరగాలి: భట్టి

నూతన విద్యుత్‌ బిల్లు ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని, దీనిపై అన్ని రాజకీయపార్టీలతోపాటు ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుపాలని కాంగ్రెస్‌ సభ్యుడు భట్టివిక్రమార్క కోరారు. కొత్త చట్టం వస్తే.. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే సబ్బిడీలను ఆపేస్తారని, రైతులకు ఇచ్చే సబ్సిడీ కూడా ఎత్తేస్తారని అన్నారు. ‘రాష్ట్రం ఇచ్చే సబ్సిడీలను ఇవ్వొద్దని కేంద్రం ఎలా చెబుతుంది? దీనిపై చర్చ జరగాలి’ అని చెప్పారు. రాష్ర్టాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోకపోతే ఈ చట్టాన్ని అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ఎంఐఎం నుంచి ఎమ్మెల్యే పాషాఖాద్రి చర్చలో పాల్గొన్నారు.


logo