పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు
పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి
ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనాలు
పరిశుభ్రత, వీధుల్లో ఎల్ఈడీ కాంతులు
నిధులతో అంతర్గత రహదారుల నిర్మాణం
ఆదర్శంగా నిలుస్తున్న మేజర్ జీపీ
బయ్యారం, ఏప్రిల్ 3: ప్రభుత్వ సంకల్పం.. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో బయ్యారం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. నెలనెలా మంజూరవుతున్న రూ.14.72 లక్షలు నిధులను సద్వినియోగం చేసుకుంటూ మిగతా జీపీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ‘పల్లె ప్రగతి’ని పక్కాగా చేస్తుండడంతో అంతర్గత రహదారులు, పచ్చదనంతో నిండి ఉండే వీధులు, ఎల్ఈడీ విద్యుత్ కాంతులు, ఆహ్లాదం పంచే పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, చివరి మజిలీ చింత తీర్చే వైకుంఠధామం ఇలా సకల సదుపాయాలతో ఈ మేజర్ జీపీ భేష్ అనిపించుకుంటోంది.
ప్రభుత్వం తలపెట్టిన ‘పల్లె ప్రగతి’ని బయ్యారంలో విజయవంతంగా అమలు చేశారు. ఇటు ప్రజాప్రతినిధుల ప్రత్యేక శ్రద్ధకు అధికారుల పర్యవేక్షణ, గ్రామస్తుల సహకారం తోడవడంతో ఈ జీపీ అభివృద్ధిలో ముందువరుసలో ఉంది. గ్రామంలో మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మండలకేంద్రమైన బయ్యారం మేజర్ గ్రామ పంచాయతీలో 2,450 ఇండ్లు ఉండగా, సుమారు 8వేల మంది నివసిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం ప్రతి నెలా రూ.14,72,954 నిధులు అందుతున్నాయి. ఈ నిధులతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతూ ప్రగతి పథంలో ముందుకు సాగుతోంది. రూ.8లక్షలతో శ్మశానవాటిక, రూ.2.3 లక్షలతో కంపోస్ట్ట్ షెడ్, డంపింగ్ యార్డ్, నర్సరీ ఏర్పాటుచేశారు. అలాగే క్రమం తప్పకుండా గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నారు.
పచ్చదనం.. పరిశుభ్రతకు పెద్దపీట
పల్లె ప్రగతి పనుల్లో పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. దీంతో పరిసరాలు ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. బయ్యారంలో ప్రభుత్వ స్థలం లేకపోవడంతో కట్టుగూడెం సమీపంలో రూ.3.10 లక్షలతో ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. అలాగే పక్కనే రంగాపురం, కట్టుగూడెంలోనూ మరో రెండు పార్కులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో పార్కులో 4వేల చొప్పున వివిధ రకాల మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. బయ్యారం పెద్దగుట్ట సమీపంలో ప్రకృతి వనం ఉండ డం వానకాలంలో గుట్టపై ఉన్న జలపాతాలను సందర్శించేందుకు వచ్చే వారికి కూడా ఆహ్లాదం పంచనుంది. అలాగే మండలకేంద్రంలోని రెండు ప్రధాన రహదారులకు ఇరువైపులా రూ.2.5 లక్షలతో 1600 మొక్కలు నాటగా.. పచ్చదనంతో కళకళ లాడుతున్నాయి. రూ.9.6 లక్షలతో కొనుగోలు చేసిన ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌తో వీధుల్లో చెత్త సేకరణ, డ్రైనేజీ లను శుభ్రం చేసేందుకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అవసరాన్ని బట్టి మరో ట్రాక్టర్ కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చూడండి..
లాలూకు మరో నెల చికిత్సనందించాలి: ఎయిమ్స్ రిపోర్ట్!
ఒడిశాలోని పది జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ