సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 16:08:50

దేశానికే ఆదర్శం ధరణి పోర్టల్‌ మంత్రి అల్లోల

దేశానికే ఆదర్శం ధరణి పోర్టల్‌ మంత్రి అల్లోల

నిర్మల్‌ : రెవెన్యూ సంస్కరణల్లో ధరణి పోర్టల్ దేశ చ‌రిత్రలో మైలురాయిగా నిలవనుందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర‌ణ్ రెడ్డి అన్నారు. బుధ‌వారం సారంగాపూర్ మండ‌ల కేంద్రంలోని త‌హసీల్దార్ కార్యాల‌యంలో ధ‌ర‌ణి పోర్టల్‌ సేవ‌ల‌ను మంత్రి ప్రారంభించారు. నిర్మల్‌ నియోజ‌క‌వ‌ర్గంలోనే  తొలి రిజిస్ట్రేషన్‌ పత్రాలను మంత్రి ల‌బ్ధిదారుకు అందించారు. పాక్‌ప‌ట్ల గ్రామానికి చెందిన మ‌హేశ్వరికి డిజిటల్‌ సంతకంతో కూడిన గిఫ్ట్ డీడ్  రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఆయ‌న‌ అందజేశారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధ‌ర‌ణి  పోర్టల్‌ సేవ‌ల‌ను అందుబాటులోకి తేవ‌డంతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌న్నారు. మ‌న‌ ప్రభుత్వం తెచ్చిన రెవెన్యూ సంస్కరణలను ఇత‌ర  రాష్ట్రాలు ఫాలో అయ్యే అవ‌కాశం ఉంద‌న్నారు.  ధరణి పోర్టల్‌లో స్లాట్‌ బుకింగ్‌ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసిందని, స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారెవరైనా నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఇది వరకు రిజిస్ట్రేషన్‌ కోసం డాక్యుమెంట్‌ రైటర్‌ను సంప్రదించి, కొంత నగదును కమిషన్‌ రూపంలో ఇస్తే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరితంగా అయ్యేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. కొనుగోలు, అమ్మకందారుడెవరైనా నేరుగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా స్లాట్‌బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ధరణి పోర్టల్ తో అన్ని సేవ‌లు పార‌ద‌ర్శకంగా ఉంటాయ‌న్నారు. ఒక్క రూపాయి కూడా లంచం ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.