బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 02:59:27

సోలిపేటకు మంత్రి హరీశ్‌ పరామర్శ

సోలిపేటకు మంత్రి హరీశ్‌ పరామర్శ

  • ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ వాకబు
  • అనారోగ్యంతో దవాఖానలో చేరిన దుబ్బాక ఎమ్మెల్యే

దుబ్బాక టౌన్‌: అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం పరామర్శించారు. ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డితో మాట్లాడి.. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని కోరారు. మంత్రి వెంట నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఉన్నారు. రామలింగారెడ్డి ఈ నెల 22న కాలుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. 

కిడ్నీ సమస్య తలెత్తడంతో  మూడ్రోజుల కిందట హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)లో చేరారు. మరోవైపు, రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. వైద్యులకు ఫోన్‌చేసి పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నట్టు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు తెలిపారు. మంత్రి కేటీఆర్‌ సైతం రామలింగారెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. సీఎంవో ప్రతినిధులు దేశపతి శ్రీనివాస్‌, దేవీప్రసాద్‌ దవాఖానకు వెళ్లి రామలింగారెడ్డిని పరామర్శించారు. సోలిపేట ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నదని దవాఖానవర్గాలు వెల్లడించాయి.logo