వేల ఏళ్ల క్రితం ఇళ్లారా గుండు కింద నివాసం
అనేక చారిత్రక విశేషాల నిలయం
వెలుగులోకి తెచ్చిన చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి
భీమదేవరపల్లి, మార్చి 29: భద్రకాళీ సమేత వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ, అతి పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నది. వేల ఏళ్ల క్రితం ఆదిమానవులు ఇక్కడ నివాసమున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులుగా ఇక్కడి కొత్తగుట్ట పరిసరాల్లో పురావస్తు, చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం కొత్తకొండ గుట్టపై ఉన్న ఇళ్లారా గుండు గురించి అనేక విషయాలు తెలియజేశారు. కొల్లేటి శ్రీనివాస్, సిద్దమల్ల రాజేందర్ బృందంతో కలిసి రత్నాకర్‌రెడ్డి కొత్తకొండ వీరన్న గుట్ట పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై టెర్రకోట కేక్స్ బయటపడడంతో హరప్పా సంస్కృతి ఇక్కడివరకూ వ్యాప్తి చెందిందని గుర్తించారు. ఈ ఇళ్లారా గుండు కింద పదివేల ఏళ్ల క్రితం ఆదిమానవులు జీవించినట్లు ఆధారాలున్నాయని వివరించారు. ఇళ్లారా అంటే విశాలమైన అని అర్థం. ఇక్కడి గుహలో సుమారు 500గొర్రెలతో ఉన్న మంద కూడా పడుతుందని చెప్పారు. వీరన్న గుట్ట నుంచి గుమ్మి గుట్టకు వెళ్లే తొవ్వలో వీరన్న గుట్టకు సుమారు 30ఫీట్ల ఎత్తులో ఇది ఉంది. ఏటవాలుగా ఉన్న తోవలో దట్టమైన తీగజాతి మొక్కల్లోంచి తోవ తీసుకుని పైకి వెళ్లాల్సి ఉంటుంది.
గుహలో రాతిపనిముట్లు..
12అడుగుల ఎత్తు, వంద అడుగుల పొడవు, 45అడుగుల వెడల్పుతో ఉన్న విశాలమైన గుహకు పడమర వైపు ప్రధాన ప్రవేశద్వారం ఉన్నది. నైరుతి మార్గంలో ఉన్న ప్రవేశద్వారాన్ని గుహ లోపలినుంచి మూసివేశారు. గుహ లోపల రెండు పెద్ద బండల నడుమ సుమారు 15 అడుగుల పొడవున చిన్న చిన్న మట్టి రాళ్లను ఉపయోగించి గోడ కట్టి మూసివేశారు. ఆ గోడ శిథిల ఆనవాళ్లు కూడా ఒక బండపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. గుహలోపలి నుంచి ఉత్తరం వైపు పైకి వెళ్లే దారి ఉంది. గుహలోపల, గుహ ముందుభాగంలో సూక్ష్మరాతి పనిముట్లు నవీన శిలాయుగం నాటి రాతి గొడ్డలి, పదునైన బలపం రాయి పనిముట్లు లభించాయి. నలుపు, ఎరుపు, బూడిద రంగు మృన్మయ పాత్రల ముక్కలు, ధాన్యం నిల్వ చేసే గాబుల అంచులు కనిపించాయి. సమీప రైతులు ఎన్నో ఏళ్లుగా ఇళ్లారా గుండు గుహను పశువుల కొట్టంగా ఉపయోగించడంతో ఇక్కడ ఆధారాలు చాలామట్టుకు కనిపించకుండా పోయాయి. బర్రె గుడి, వీరప్ప గుడి మధ్య ఎర్ర చల్క పాటి గడ్డ ఉంది. ఇక్కడ రాతిపాత్ర (కప్పు), రాతి కవ్వం లభించాయి.