మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 02:57:38

పరాయి లీడర్లు.. కిరాయి మనుషులు

పరాయి లీడర్లు.. కిరాయి మనుషులు

  • కాంగ్రెసోళ్ల ప్రచారంపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు 
  • ఉత్తమ్‌.. ఏనాడైనా దుబ్బాక వచ్చావా?
  • మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఉసురు పోసుకున్నారు 
  • ఓట్లు అయ్యేదాక ఉండేవాళ్లు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు
  • ఓట్లయ్యాక కూడా ఉండేటోళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీ వాళ్లు 
  • దుబ్బాక టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట 
  • ఆర్థ్ధికశాఖ మంత్రి  హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెసోళ్ల ప్రచారానికి పరాయి లీడర్లు, కిరాయి మనుషులు వస్తున్నా రని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. నల్లగొండ నుంచే కిరాయి జనరేటర్‌, కిరాయి సౌండ్‌ తెచ్చుకునే పరిస్థితి ఆ పార్టీది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ హయాం లో మంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా దుబ్బాకకు వచ్చావా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించారు. గురువారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్‌ మండలకేంద్రంలో యువత, విద్యార్థులతో గులాబీ యువగళం సన్నాహక సదస్సుకు మంత్రి హాజరయ్యారు. మొదట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలిసి భారీ బైక్‌ ర్యాలీలో హరీశ్‌రావు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన  సమావేశంలో యువత, విద్యార్థ్థులను ఉద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దౌల్తాబాద్‌లో రెండు మూడు వందల బైక్‌లతో మీటింగ్‌ పెట్టుకుందామంటే వెయ్యికి పైగా బైక్‌లపై యువకులు భారీగా తరలివచ్చారన్నారు. ఇతర పార్టీల వాళ్లు తమకు యూత్‌ ఉన్నదని అంటున్నారనీ.. కానీ, యువ త అంతా గులాబీ వైపే ఉన్నదని స్పష్టంచేశారు.  బీజేపీ నాయకుల్లారా.. యూత్‌ టీఆర్‌ఎస్సే.. రైతు టీఆర్‌ఎస్సే.. మహిళలు టీఆర్‌ఎస్సే.. విద్యార్థులు టీఆర్‌ఎస్సే.. మొత్తం దుబ్బాక అంతా టీఆర్‌ఎస్సేనని చెప్పారు. ‘ప్రతి గల్లీలో, ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురుతున్నది. ఎక్కడ చూసినా టీఆర్‌ఎస్‌ జెండానే కనిపిస్తున్నది. కాంగ్రెస్‌, బీజేపీకి పరాయి లీడర్లు, కిరాయి మనుషులు.. వాళ్లు ఇక్కడకు వచ్చి మన పెట్రోలు బంక్‌లు, చాయి హోటళ్లు, కిరాణ దుకాణాలకు ఇంత గిరాకీ చేసి పోతారు. పోంగపోంగా కొండపోచమ్మ ప్రాజెక్టు చూసి వెళ్తారు.. అట్లయిన వాళ్ల జన్మ ధన్యమవుతుంది. వాళ్లు ప్రాజెక్టులు కట్టకపాయె.. సీఎం కేసీఆర్‌ కట్టారని దాన్ని చూసి వెళ్తారు’ అని   అన్నారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోట.. 2001 నుంచి ఏ ఎన్నిక జరిగినా గులాబీ జెండానే ఎగిరిందని హరీశ్‌రావు అన్నారు. బాయిల కాడ మీటర్లు పెడితే రూ.2,500 కోట్లు ఆఫర్‌ ఇస్తామని కేంద్రంలో ఉన్న బీజేపీ ఆఫర్‌ ఇస్తే, మీటర్లు వద్దు, 2500 కోట్లు వద్దనీ..  తెలంగాణ రైతుల సంక్షేమమే మాకు ముద్దు అని సీఎం కేసీఆర్‌ తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రైతు ఆత్మ హత్యలు చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఇవ్వాళ రైతు ఏరకంగా చనిపోయినా రూ.5 లక్షలు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆ కుటుంబానికి భరోసానిస్తున్నదన్నారు. ఓట్లు అయ్యేదాక ఉండే వాళ్ళు కాంగ్రెస్‌, బీజేపీ పార్టీ వాళ్ళు.. ఓట్లయ్యాక కూడా ఉండేటోళ్లు టీఆర్‌ఎస్‌ వాళ్లేనని మంత్రి చెప్పారు. ఈ రోజు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రామలింగారెడ్డి ప్రజల ఇంటింటికీ తాగునీరు అందించారన్నారు. ప్రతి నీటి బిందెలో సీఎం కేసీఆర్‌, రామలింగన్న కనిపిస్తారన్నారు.  అనంతరం రాయపోల్‌ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని టీఆర్‌ఎస్‌లో చేరారు.  

నిండు మనస్సుతో దీవించండి : టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత

దుబ్బాక ప్రజలు నిండు మనస్సుతో తనను దీవించి ఉప ఎన్నికలో గెలిపించాలని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి  విజ్ఞప్తిచేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, చేగుంట మండలాల్లో  మెదక్‌, ఆందో ల్‌, నర్సాపూర్‌ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఆమె ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రా ష్ట్రంలోనే దుబ్బాక నియోజకవర్గంలో ఆసరా పింఛన్లు ఎక్కువ తెచ్చుకున్నామన్నారు.

నేటినుంచి దుబ్బాక ఉప ఎన్నిక నామినేషన్లు 

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. ఉదయం నోటిఫికేషన్‌ విడుదలకానున్నది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 19 వరకు గడువు ఉన్నది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ దాఖలుచేయవచ్చు. కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా నామినేషన్లు స్వీకరించనున్నట్టు దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. అభ్యర్థులు నామినేషన్‌ను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నా.. అభ్యర్థులు తమ నామినేషన్‌ పత్రాన్ని రిటర్నింగ్‌ అధికారికి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్టు చెన్నయ్య తెలిపారు.

మహిళలను కించపర్చడమే కాంగ్రెస్‌ సంస్కృతా?:మంత్రి తన్నీరు హరీశ్‌రావు  

దుబ్బాక ఉప ఎన్నికల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతను అవమాన పరిచే విధంగా మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ భేషరుతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. దివంగత ఎమ్మెల్యే రామలింగన్న మృతిచెందడంతో ఆ కుటుంబానికి టీఆర్‌ఎస్‌ అండగా నిలిచిందన్నారు. ‘దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆమెకు(సుజాతక్కకు) కుడి, ఎడమ భుజాలుగా నేను, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఉంటామని చెప్పాం. దీనిని వక్రీకరిస్తూ.. ఉత్తమ్‌ సుజాతను అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయటం బాధాకరం’ అని హరీశ్‌రావు అన్నారు. పుట్ట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ అని చూడకుండా కించపరిచే విధంగా మాట్లాడడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్‌ సంస్కృతి, ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గ అక్కా చెల్లెండ్ల్లు ఉత్తమ్‌కు, కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి హెచ్చరించారు. 


logo