శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 01:51:01

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కండ్లు

సిద్దిపేట, దుబ్బాక నాకు రెండు కండ్లు

  • ఇంటింటికీ నల్లా.. ప్రతి ఎకరాకు కాళేశ్వరం నీరు
  • దుబ్బాకలో పర్యటనలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు

దుబ్బాక: ఇంటింటికీ నల్లా నీరు.. ప్రతి ఎకరానికి సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ సర్కారుకే దక్కిందని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్‌ పాల్గొన్నారు. రూ.85 లక్షలతో నిర్మించిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను, రామసముద్రం చెరువు కట్టపై రూ.10 లక్షలతో నిర్మించిన ట్విన్‌ టాయిలెట్స్‌ను ప్రారంభించారు. పట్టణంలోని పలు వార్డుల్లో రూ.80 లక్షలతో మురుగునీటి కాలువల నిర్మాణానికి శంకుస్థాపనచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాకపై సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానమున్నదని గుర్తుచేశారు. 70 ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలు పడుతున్న తాగు, సాగునీటి సమస్యను సీఎం కేసీఆర్‌ పరిష్కరించారన్నారు.

దుబ్బాకలో మల్లన్నసాగర్‌ పిల్ల కాలువల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయని చెప్పారు. సిద్దిపేట, దుబ్బాక తనకు రెండు కండ్లు అని, దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధిచేసేందుకు పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 20 వేల మంది బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి అందిస్తున్నదని గుర్తుచేశారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 56,906 మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు పింఛన్‌ పొందుతున్నారని చెప్పారు. దుబ్బాకలో 800 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, రూ.15 కోట్లతో నిర్మించిన పాఠశాల భవనాలను త్వరలోనే సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రొట్టే రాజమౌళి, దుబ్బాక మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వనిత తదితరులు ఉన్నారు.


logo