ఆదివారం 07 జూన్ 2020
Telangana - Apr 05, 2020 , 01:05:54

భయపడాల్సింది ఏమీ లేదు

భయపడాల్సింది ఏమీ లేదు

  • కరోనా నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు సూచన 
  • మెదక్‌లో పర్యటన

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా ఇంటింటి సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. శనివారం ఆయన మెదక్‌, దుబ్బాక ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మెదక్‌ జిల్లా కేంద్రంలోని అజంపురలో పర్యటించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినందున ఏ ఒక్కరూ అధైర్యపడొద్దని సూచించారు. అనంతరం జిల్లా కేంద్ర దవాఖానలో మంత్రి హరీశ్‌రావు ఐసొలేషన్‌ వార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి.. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, ప్రజలకు సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సొసైటీ చైర్మన్లు, ఐకేపీ ప్రతినిధులు, ఎంపీడీవోలు, సర్పంచ్‌లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులతో మంత్రి హరీశ్‌రావు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

బియ్యం పంపిణీ పరిశీలన..

మెదక్‌లోని అటవీ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రేషన్‌ దుకాణాన్ని మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉచిత బియ్యం కోసం వచ్చిన లబ్ధిదారులు ఇద్దరితో మాట్లాడారు. పెన్షన్‌ వస్తుందా? నెలనెలా రేషన్‌ బియ్యం అందుతున్నాయా? అని మహిళలను ప్రశ్నించగా?.. అందుతున్నాయి సారూ అని వారు సమాధానమిచ్చారు. రేషన్‌ దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడంతోపాటు అక్కడే సబ్బు, నీళ్లు, శానిటైజర్‌ను ఉంచడంతో మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఉదయం చేగుంటలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. 


logo