ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 01:46:43

రాష్ట్రంలో 1200 చెక్‌డ్యాంలు

రాష్ట్రంలో 1200 చెక్‌డ్యాంలు
  • రూ.3,825 కోట్లతో నిర్మాణం
  • శాసనసభ ప్రశ్నోత్తరాల్లో మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్లతో 1200 చెక్‌డ్యాంల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 600, వచ్చే ఏడాదిలో మిగిలిన వాటి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని పేర్కొన్నారు. వీటి నిర్మాణ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో చెక్‌డ్యాంలు నిర్మించి వెచ్చించిన ప్రతిపైసాకు ఫలితం చూపిస్తామని తెలిపారు. శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చెక్‌డ్యాంల నిర్మాణంపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 


ఈ చెక్‌డ్యాంల నిర్మాణంతో వాగులు, వంకల్లో సుమారు 15 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని, మూడులక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నదీజలాల్నే కాకుండా వాగు, వంకల్లో నుంచి వచ్చే ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపడతామని, అందుకు ప్రభుత్వం సమగ్ర చర్య లు తీసుకుంటుందని హరీశ్‌రావు చెప్పా రు. రాష్ట్రం ఏర్పడ్డాక 146 చెక్‌డ్యాంలు మంజూరుచేశామని, అందులో 53 పూర్తికాగా, మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు అయినందున వ్యవసాయం, సాగునీటిరంగం లో తీసుకొంటున్న చర్యలతో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువుల పునరుద్ధరణ చేపట్టిందని, వీటితో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కాల్వ ల్లో రూ.471 కోట్లతో 3 వేల తూముల (ఓటీ) నిర్మాణం చేపట్టగా.. అందులో 70 శాతం పను లు పూర్తయినట్టు చెప్పారు. 


logo