బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 21, 2020 , 02:42:38

పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యం

పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యం
  • సీఎం కేసీఆర్‌ ఆలోచనలను అమలుచేద్దాం
  • సంకల్ప బలంతో ముందుకెళ్దాం
  • కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో మేలు
  • పంచాయతీరాజ్‌ సమ్మేళనాల్లో మంత్రులు
  • కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లోంచి పుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేసి గ్రామాలను   అభివృద్ధిలో ముందంజలో నిలుపుకుందామని పలువురు మంత్రులు పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్‌, జగిత్యాల, కామారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ అర్బన్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులకు మంత్రులు అవగాహన కల్పించారు. 


కొత్త చట్టంపై అవగాహన పెంచుకోవాలి: మంత్రి తన్నీరు హరీశ్‌రావు 

నూతన పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన పెంచుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ‘పల్లెప్రగతికి పంచాయతీ సమ్మేళనం’పై సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన సమీక్షలో  పట్టణప్రగతిపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన పల్లెప్రగతిలో మిగిలిపోయిన పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. సీఎం కోరుకున్నట్టు జిల్లాను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుపాలని సూచించారు. జిల్లాలో కొన్నిఅంశాల్లో వెనుకబాటుకు గురైన మండలాల ఎంపీడీవోలు, ఇంజనీరింగ్‌శాఖ అధికారులను మందలించారు.  సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్‌, రామలింగారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, దేవీప్రసాద్‌ పాల్గొన్నారు.


సామాజికసేవగా గుర్తించాలి: మంత్రులు ఈటల, గంగుల 

పల్లె ప్రగతిని సామాజిక సేవగా గుర్తించి గ్రామాలను అభివృద్ధి చేయాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంత్రులు ఈటల రాజేందర్‌, గంగుల కమలాకర్‌ పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్‌లో జరిగిన పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. సర్పంచులు, ఎంపీటీసీసభ్యులు అభివృద్ధికి పునాదిరాళ్లలాంటి వాళ్లని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు రసమయి, సుంకె, ఎమ్మెల్సీ నారదాసు, జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ  తదితరులు పాల్గొన్నారు.  


దేశం గర్వించేలా కేసీఆర్‌ పాలన: మంత్రి ఎర్రబెల్లి

దేశం గర్వించేలా సీఎం కేసీఆర్‌ పాలన సాగుతున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం భూపాలపల్లిలో  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో జరిగిన పంచాయతీరాజ్‌ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయన్నారు. మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమంతో పాటు మున్సిపాలిటీల్లో  సైతం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. 


సీఎం నాయకత్వంలో అభివృద్ధి పరుగులు: మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో  పంచాయతీరాజ్‌ సమ్మేళనం, పట్టణప్రగతిపై వేర్వేరుగా జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఆరేండ్లుగా రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జెడ్పీచైర్‌పర్సన్‌ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యేలు కిశోర్‌కుమార్‌, మల్లయ్యయాదవ్‌, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ చిన్నపురెడ్డి,  కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ప్రజలకు సేవ అదృష్టంగా భావించాలి:  మంత్రి వేముల

ప్రజలకు సేవ చేయడాన్ని ప్రజాప్రతినిధులు అదృష్టంగా భావించాలని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.   కామారెడ్డి జిల్లాకేంద్రంలో  జరిగిన పట్టణ ప్రగతి, పంచాయతీ సమ్మేళనానికి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ఏనాడు గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. 


‘పట్టణ ప్రగతి’ని విజయవంతం చేయాలి: మంత్రి పువ్వాడ

పల్లెప్రగతి స్ఫూర్తితో చేపట్టిన పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ,  కొత్తగూడెంలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమాల్లో  మంత్రి  పాల్గొన్నారు. పట్టణ ప్రగతి ఉమ్మడి ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఉంచేందుకు ప్రతీ ఒక్కరూ కంకణబద్దులై బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, జెడ్పీచైర్మన్‌ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు వెంకటేశ్వరరావు,  హరిప్రియా నాయక్‌ పాల్గొన్నారు.  


పల్లె ప్రగతికి సీఎం అధిక ప్రాధాన్యత: మంత్రి సత్యవతి రాథోడ్‌

పల్లెల అభివృద్ధికే సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యమిస్తున్నారని స్త్రీ,శి శు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. ములుగులో  జరిగిన పంచాయతీరాజ్‌ సమ్మేళనం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత సర్పంచులు అదృష్టవంతులని, గత ప్రభుత్వాల కాలంలో సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో నిధులు ఉండేవి కావని మంత్రి అన్నారు. 


చిత్తశుద్ధితో పని చేయాలి: మంత్రులు ఈటల, కొప్పుల

చిత్తశుద్ధితో పనిచేసేవారికి  చట్టాలు అడ్డురావని, సంకల్ప బలంతో పల్లెల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులు ఈటల రాజేందర్‌,  కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాలలో గురువారం పంచాయతీరాజ్‌ సమ్మేళనం, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో వారు పాల్గొన్నారు.  సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం విజయవంతంకావడానికి టీఆర్‌ఎస్‌కు ఉన్న సంకల్పబలమే కారణమన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ రవి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ లోక బాపురెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ: మంత్రి సింగిరెడ్డి

అభివృద్ధి చెందిన దేశాల సరసన తెలంగాణ రాష్ట్రం నిలబడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ వివిధ పథకాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలుగా చెబుకుంటున్న అమెరికా, జపాన్‌, జర్మనిలాంటి వన్ని గతంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నవేనని మంత్రి పేర్కొన్నారు. గురువారం వనపర్తిలో పంచాయతీరాజ్‌ సమ్మేళనం - పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశంలో ఎంపీ రాములు, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ లోకనాథ్‌రెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు.  అమెరికాకు 500 ఏండ్ల చరిత్ర మాత్రమే ఉందని, నేడు ఆ దేశం అన్నింటా ముందు వరసలో నిలిచిందన్నారు. 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న సింధూ నాగరికత పరిధిలోని మన ప్రాంతం ఇప్పటికి మరుగుడొడ్ల, మురుగు కాల్వల నిర్మాణం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల ఏర్పాటులాంటి వాటిపైన ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన దుస్థితి ఉందన్నారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో నంబర్‌వన్‌గా నిలపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.  


పట్టణాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి: మంత్రి అల్లోల

పల్లెప్రగతి స్ఫూర్తితోనే పట్టణాలు మెరువాలని దేవాదాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్‌లో ఉదయం పది గంటలకు పంచాయతీరాజ్‌ సమ్మేళనం, మధ్యాహ్నం 2 గంటలకు ఏసీసీలోని పటేల్‌ గార్డెన్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యంతోనే విజయవంతం అవుతుందని అన్నారు. గాంధీజీ కలలను సీఎం కేసీఆర్‌ నిజం చేస్తున్నారని పేర్కొన్నారు. పది రోజుల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని, మండల, పంచాయతీ అధికారులు నెలకు వారం రోజులు గ్రామసభలు నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశాల్లో జెడ్పీ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కలెక్టర్‌ భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు.


logo