బుధవారం 20 జనవరి 2021
Telangana - Nov 28, 2020 , 01:22:46

రెచ్చగొట్టేటోళ్లతో జాగ్రత్త!

రెచ్చగొట్టేటోళ్లతో జాగ్రత్త!

  • మీ ఓటు అభివృద్ధికా? అడ్డుకునే వాళ్లకా?
  • లాక్‌డౌన్‌ టైమ్‌లో బీజేపీ, కాంగ్రెసోళ్లు ఎక్కడున్నారు?
  • రోడ్‌షోలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు

రామచంద్రాపురం: ‘ఒకరేమో దారుస్సాలాం కూలుస్తానంటాడు.. మరొకరు పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ సమాధులను కూలుస్తామని చెప్తున్నాడు.. కానీ, ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు’  అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు విమర్శించా రు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌తో కలిసి అశోక్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం మైనార్టీ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లాక్‌డౌన్‌ సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు వారి ఇండ్లుదాటి బయటకు రాలేదని, టీఆర్‌ఎస్‌ నేతలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు భరోసా కల్పించారని గుర్తుచేశారు. 

కష్టకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అం డగా నిలిచిందన్నారు. దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని, అభివృద్ధి, సంక్షేమం విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాజీపడకుండా పనిచేస్తున్నదని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారే తప్ప, ప్రజల బాగుకోసం ఒక్కరు కూడా ఆలోచన చేయడం లేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం తాపత్రయపడే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్కరేనని తెలిపారు. 

ఎన్నికల తర్వాత వరద సాయం

వరదలు వస్తే నష్టపోయిన బాధితులకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం చేశామని, ఎన్నికల కౌంటింగ్‌ పూర్తవ్వగానే 5వ తేదీ నుంచి వరద సాయం అందజేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. మొత్తం 6,60లక్షల మందికి వరద సహాయం చేశామన్నారు. రూ.15వేల లోపు ఉన్న ఇంటి పన్నులను 50 శాతం మాఫీ చేసినట్లు తెలిపారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చెప్పినట్లు ఇంటింటికి నల్లా నీటిని ఇవ్వడమే కాకుండా.. ఇప్పుడు నల్లా బిల్లులనే మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భెల్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆసరా పింఛన్లతోపాటు రేషన్‌, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తామన్నారు. 

అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లను అందజేస్తామని మంత్రి చెప్పారు. స్థానిక సంస్థలకు కేంద్రం నిధులు ఇవ్వడాన్ని చట్టం ఒప్పుకోదని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారని, అలాంటప్పుడు వారు హైదరాబాద్‌ను ఎలా అభివృద్ధి చేస్తారో అర్థం చేసుకోవాలన్నారు. ప్రజలు బాగా ఆలోచించి డిసెంబర్‌ 1న జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, 112 డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి పుష్పానగేశ్‌, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పాండురంగారెడ్డి, అంజయ్య, పరమేశ్‌, ప్రమోద్‌గౌడ్‌, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్న పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్‌లో హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు కనీసం ఇండ్లుదాటి బయటకు రాలేదు.                 

-తన్నీరు హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి 


logo