మంగళవారం 07 జూలై 2020
Telangana - Apr 24, 2020 , 01:58:52

పునీతమైన పురిటిగడ్డ

పునీతమైన పురిటిగడ్డ

  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీక్షకు ఫలితం 
  • ఆచంద్రార్కం సీఎం కీర్తి నిలిచిఉంటుంది
  • ఆర్థికశాఖమంత్రి టీ హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ జలసాధన ఉద్యమంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అకుంఠిత దీక్ష ఫలించిందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం గోదారమ్మ రంగనాయకుడి సన్నిధికి చేరిందని, గోదావరి జలాలతో పురిటిగడ్డ పునీతమైందని తెలిపారు. సిద్దిపేట జిల్లా రైతుల సాగునీటి కలను సాకారంచేసిన సీఎం కేసీఆర్‌ కీర్తి ఆచంద్రార్కం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కొనియాడారు. రంగనాయకసాగర్‌ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణం ద్వారా సీఎం కేసీఆర్‌ భగీరథ యజ్ఞంచేశారన్నారు. దశాబ్దాలుగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సిద్దిపేట ప్రాంతం రైతు ఆత్మహత్యలకు చిరునామాగా మారిందని.. సమైక్యరాష్ట్రంలో ఇక్కడి రైతుల సాగునీటి కష్టాలను పాలకులు పట్టించుకోలేదని గుర్తుచేశారు. 

ఆత్మహత్యలు, కరంట్‌ కష్టాలతో రైతులకు పురుగుమందే పెరుగన్నమైందన్నారు. బోరుబావులపై ఆధారపడి వ్యవసాయంచేయాల్సిన పరిస్థితుల్లో చాలామంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని చెప్పారు. దుబ్బాక ప్రాంతంలో ఆకలిచావులు అధికంగా జరిగాయని గుర్తుచేశారు. వీటిని నివారించేందుకు సీఎం కేసీఆర్‌.. తానే ఇంజినీరై భగీరథ యజ్ఞంచేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారన్నారు. భూములు త్యాగంచేసిన రైతులకు పరిహారం అందజేసి, ఇండ్లుపోతున్న వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ఇండ్లను నిర్మించి ఇచ్చామని తెలిపారు. భూములిచ్చిన రైతుల త్యాగాలు మరువలేనివని.. వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు వల్ల సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఈ మహా జలక్రతువులో భాగస్వామి అయినందుకు తన జన్మ చరితార్థమైందని, ఒక ప్రజాప్రతినిధిగా ఇంతకంటే పొందే సంతృప్తిమరేమీ ఉండదని హరీశ్‌రావు అన్నారు.


logo