శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 17:05:31

డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల పురోగ‌తిపై మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్ష‌

డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల పురోగ‌తిపై మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్ష‌

సిద్దిపేట : జిల్లాలోని దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన‌ డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల పురోగ‌తి, కేటాయింపుల‌పై మంత్రి హ‌రీశ్‌రావు అధికారుల‌తో శ‌నివారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్‌రెడ్డి, క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ... దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో 25 గ్రామాల్లో డ‌బుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తైన నేప‌థ్యంలో సాధ్య‌మైనంత త్వ‌ర‌గా వీటిని ల‌బ్దిదారుల‌కు అందించాల‌న్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఇండ్ల కేటాయింపులు చేప‌ట్టాల‌న్నారు. డబుల్ బెడ్‌రూం సైట్‌లో విద్యుత్‌, తాగునీటి సౌక‌ర్యం క‌ల్పించాలన్నారు. 

అదేవిధంగా దుబ్బాక నియోజకవర్గంలోని మొత్తం చెరువులు, చెక్ డ్యాములు, కుంటల్లో 15 రోజుల్లోగా చేప పిల్లలను విడుదల చేయాలని జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్యను మంత్రి ఆదేశించారు. ప్రతీ రెండు మండలాలకు ఒక్క బృందాన్ని కేటాయించి చెరువులు, కుంటల్లో చేప పిల్లలు వదలాలని పేర్కొన్నారు.  

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్ లబ్ధిదారులందరికీ చెక్కులను పంపిణీ చేసేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తహశీల్దార్లకు ఆదేశాలు జారీచేశారు. మండలకేంద్రంలో యూరియా పంపిణీ చేయాలన్నారు. అవసరానికి మించి యూరియా వాడకుండా రైతులకు అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధుల‌ను కోరారు. ప్రత్యేకించి వారం రోజులు యూరియా, ఎరువుల పంపిణీలో ఏలాంటి కొరత ఉండకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. అసంపూర్తి బ్యాంకు లింకేజీ రుణాలు పూర్తి చేయాలన్నారు. 2 వేల మంది మహిళా గ్రూపు సంఘాలకు రానున్న నెల రోజులలోపు తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపట్టాలని డీఆర్డీఏ పీడీ గోపాల్ రావును మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.


logo