గురువారం 09 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 19:39:41

సీడ్ సాగు పెంచితే..ప్రతి రైతుకు ఆదాయం:మంత్రి హరీశ్ రావు

సీడ్ సాగు పెంచితే..ప్రతి రైతుకు ఆదాయం:మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట: మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో వచ్చేలా.. రైతులను చైతన్యం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ లో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు పద్మాకర్, ముజంమీల్ ఖాన్, డీఏఓ శ్రవణ్, హార్టికల్చర్ డీడీ రామలక్ష్మి, డివిజన్, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, అరబిందో, బ్రేయర్ కంపనీ ప్రతినిధులతో పండ్లు, కూరగాయలు, స్వీట్ కార్న్ పంటల సాగుపై మంత్రి సమీక్షించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జిల్లాలో 1200 ఎకరాలలో స్వీట్ కార్న్ పంటలు సాగు చేయాలనే ఆలోచన పై ముందస్తుగా ఒప్పందం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, కిలోకు రూ.8 రూపాయల చొప్పున్న కొనుగోళ్లు చేయనున్నట్లు అధికారులు, కంపెనీ ప్రతినిధులు సమీక్షలో మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై జిల్లాలో 1200 ఎకరాల మేర స్వీట్ కార్న్ సాగు చేస్తున్న దృష్ట్యా సమీప గ్రామాల్లో 200 ఎకరాల్లో స్వీట్ కార్న్ సాగుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. దాదాపు 70 రోజుల్లో స్వీట్  కార్న్ చేతికొస్తుందని మంత్రి వివరించారు. 

జిల్లాలో సీడ్ సాగు పెంచితే.. ప్రతీ రైతుకు ఆదాయం పెరుగుతుందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గతేడాది సీడ్ సాగుకు ఈ యేటా సీడ్ సాగుపై వ్యత్యాసం చూసి జిల్లాలోని ప్రతీ మండలంలో విత్తన సాగు పెంచేలా కృషి చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో విత్తన సాగు పెరిగేలా జిల్లాలోని సీడ్ కంపెనీ ప్రతినిధులతో సమీక్షించి  సహకారం పొందాలని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డికి మంత్రి సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, పలు మండలాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


logo