శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 17:45:44

ప్రతీ నీటి బొట్టును ఒడిసి పడతాం: మంత్రి హరీశ్ రావు

ప్రతీ నీటి బొట్టును ఒడిసి పడతాం: మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్‌: క్వశ్చన్ అవర్‌లో చెక్ డ్యాంలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్ రావు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 146 చెక్ డ్యాంలు మంజూరు చేశాం. 53 చెక్ డ్యాంలు పూర్తయ్యాయి. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ చెక్ డ్యాంల కింద 56.776 ఎకరాల ఆయకట్టు సాగుకు ఇవి ప్రతిపాదించడం జరిగింది. ప్రభుత్వం 3825 కోట్ల అంచనా వ్యయంతో భారీ, మధ్య తరహా సాగు నీటి ప్రాజెక్టుల ఆయకట్టు ప్రాంతాల ప్రవాహాలపై 4వ ఆర్డర్ నుంచి 8వ ఆర్డర్ వరకు 1200 చెక్ డ్యాంలు నిర్మాణం కోసం పరిపాలన పరమైన అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది.

తెలంగాణ రాష్ట్రం రైతు రాజ్యం...  సీఎం  స్వయంగా రైతు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగు నీటి రంగంలో పెను మార్పులు  తీసుకురాగలిగాం.  నీళ్లు. నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ తెలంగాణ. ఏ నీళ్ల కోసం పోరాడామో... సీఎం కేసీఆర్‌  ఆ నీళ్లు ప్రజలకు ఇచ్చేందుకు కష్టపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులు పునరుద్ధరణ ద్వారా 15 లక్షల ఆయకట్టు స్థిరీకరించుకున్నాం. మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు చెరువుల్లో నిల్వ ఉండటం వల్ల  భూగర్భ జలాలు పెరిగాయి.  చెరువుల పరీవాహక ప్రాంతంలో ప్రతీ నీటి చుక్క ఒడిసి పట్టుకున్నాం.

 మేజర్,  మీడియం ఇరిగేషన్  కాలువల్లో ఓటీలకు అవకాశం ఇచ్చాం. దాదాపు 3000  ఓటీలను 471 కోట్లు ఖర్చు పెట్టారు. అన్ని చెరువులకు తూములు పెట్టారు. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయి. సీఎం గారు చెక్ డ్యాం విషయం ఆలోచించారు. ప్రతీ నీటి చుక్క ఒడిసి పట్టాలన్నది ఆయన ధ్యేయం. కృష్ణా, గోదావరిలో మనకు 1253 టీఎంసీల నీటి హక్కు ఉంది. కాని ఉమ్మడి రాష్ట్రంలో  పట్టించుకోకపోవడం వల్ల నీరంతా సముద్రం పాలయింది.అందుకే ప్రభుత్వం మెజర్ ఇరిగేషన్ పై దృష్టి పెట్టడం, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంలు కట్టుకోవడం వంటి వాటిపై దృష్టి సారించాం.

నిజాం సాగర్ ఆయకట్టు పరిధిలో రైతాంగం వరి సాగు ఎక్కువ చేస్తారు. ఈ సాగు వల్ల 15 నుంచి 25 శాతం నీరు వరి సాగు తర్వాత వాగులు, వంకల్లోకి వెళుతుంది. ఇదంతా కాస్ట్ లీ వాటర్. ఇవి వాగులు, వంకల నుంచి సముద్రంలోకి వెళ్తాయి.  ఇలా సముద్రం పాలవకుండా తెలంగాణలోనే నీరంతా ఉండాలని ప్రభుత్వం చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టింది. ఈ చెక్ డ్యాంల నిర్మాణం నిరంతర ప్రక్రియ. పొడవాటి నీరు ఉన్నచోట సంవత్సరం అంతా నీరు నిలువ ఉండాలన్న ఉద్దేశంతో ఈ చెక్ డ్యాంల నిర్మాణం రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో చెక్ డ్యాంల నిర్మాణం చేపడతాం.  ప్రతీ రూపాయికి ఫలితం ఉండాలి.

టెక్నికల్ టీం అధ్యయనం చేసింది. వారి సిఫారసు మేరకు విడతలు విడతలుగా చెక్ డ్యాంల నిర్మాణం చేపడతాం. ఈ చెక్ డ్యాంల వల్ల అనేక లాభాలున్నాయి. దాదాపు 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించ వచ్చు. 15 టీఎంసీల  నీటి నిల్వ సామర్థ్యం వాగుల్లో వంకల్లో నిలుపుకోవచ్చు. గ్రౌండ్ వాటర్  చెక్ డ్యాం పరిధిలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు పెరుగుతుంది. పొడవాటి నీరు, వర్షం నీరు కలవడం వల్ల చేపల పెంపకం పెరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో చెట్లు పెరుగుతాయి. 1200 చెక్ డ్యాంలలో ఈ ఆర్థిక సంవత్సరంలో 600, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 600 చెక్ డ్యాంలు కడతాం.  ఈ నిర్మాణానికి  నాబార్డ్ నిధులు సమకూర్చుకున్నాం.

భూపాలపల్లిలో 16 చెక్ డామ్ లు నిర్మించనున్నాం. రానున్న రెండేళ్లలో ఇవి నిర్మిస్తాం. చొప్పదండిలో 18 మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 13, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు నిర్మిస్తాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో 13 చెక్ డ్యాంలు ఈ  ఆర్థిక సంవత్సరంలో నిర్మిస్తాం. దేవరకద్ర నియోజకవర్గంలో ఈ ఏడాది 17, వచ్చే ఏడాది 7 చెక్   డ్యాంలు ప్రతిపాదించాం. అచ్చంపేట నియోజకవర్గంలో ఈ ఏడాది 8 నిర్మిస్తాం, వచ్చే ఆర్థిక సంవత్సరం మరో 8 మంజూరు చేస్తాం.ఇబ్రహీం పట్నంలో 3, మునుగోడులో 7 ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరు నిర్మిస్తాం. ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు


logo