సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:13

కరోనా సాయంలో మనమే టాప్‌

కరోనా సాయంలో మనమే టాప్‌

  • వీధి వ్యాపారులకు రుణాలు
  • రేషన్‌ డీలర్లకు కమీషన్‌
  • మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సంగారెడ్డి టౌన్‌: కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. పేదలకు ఉచిత బియ్యంతోపాటు ఇతర అన్ని వర్గాల వారికి తగిన రీతిలో ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజూరైన 30 చెత్త సేకరణ ఆటోలను మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో మెప్మా ఆధ్వర్యంలో పట్టణ వీధి విక్రయ వ్యాపారులకు రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కరో నా వేళా ప్రజలు ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్‌ తెల్లరేషన్‌ కార్డుదారులకు ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున, వలస కార్మికులకు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించారన్నారు. అదేవిధంగా తెల్లరేషన్‌ కార్డుదారులకు మరో మూడు నెలలు కూడా ఒక్కొక్కరికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలలపాటు ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ చేసిన డీలర్లకు కమీషన్‌ రూపంలో ఇవ్వాల్సిన రూ.1,53,56,673 చెక్కును పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 5,978 మంది వీధి వ్యాపారులను గుర్తించి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణం అందించినట్లు చెప్పారు. గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేసిన మహిళా స్వయం సహాయక సంఘాలకు మంత్రి రూ.1.12 కోట్ల చెక్కును అందజేశారు. పట్టణ మహిళా సంఘాల సభ్యులకు బ్యాంక్‌ లింకేజీ కింద రూ.7.64 కోట్ల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హనుమంతరావు, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మె ల్యే క్రాంతి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo