ఆదివారం 31 మే 2020
Telangana - May 07, 2020 , 01:42:18

బీజేపీ, కాంగ్రెస్‌ చేసింది శూన్యం

బీజేపీ, కాంగ్రెస్‌ చేసింది శూన్యం

  • మద్దతు ధర చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే 
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో రైతుల కోసం ఏం ఉద్ధరించారో ఆ పార్టీలు  వెల్లడించాలని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మద్దతు ధర చెల్లించి అన్ని పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మెదక్‌ జిల్లాలోని నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట మండలాల్లో కొండపోచమ్మ సాగర్‌ కెనాల్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. రామాయంపేటలో భూ నిర్వాసితులకు చెక్కులను పంపిణీచేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఉన్న కర్ణాటకలో క్వింటాల్‌ వడ్లను రూ.1500 లకు కొంటుండగా, తెలంగాణలో రూ.1,835 చెల్లిస్తున్నామని చెప్పారు. రైతుల కోసం 24 గంటలు పనిచేస్తున్న కేసీఆర్‌పై విమర్శలు మానుకోవాలన్నారు. వడ్లు, శనిగలు, జొన్నలు, పెసర్ల కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైన 24 గంటల విద్యుత్‌ ఉచితంగా ఇస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. logo