బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:46:58

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు

  • 2023లో కాంగ్రెస్‌కు 79 సీట్లు వస్తాయట
  • ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జి పగటికలలు
  • ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా

మెదక్‌: తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ బీజేపీపై పోరాటం చేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ రెండు పార్టీలు రహస్య చీకటి ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. ‘మూడు వ్యవసాయ బిల్లులు మోదీ ప్రభుత్వం తెచ్చిందా?.. కేసీఆర్‌ ప్రభుత్వం తెచ్చిందా?.. రైతులకు వ్యతిరేకంగా మూడు బిల్లులు బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్రమోదీ తెస్తే, ధర్నా ఢిల్లీకి వ్యతిరేకంగా.. విమర్శలు మాత్రం కేసీఆర్‌పై చేయడం ఎంతవరకు సమంజసం’ అని హరీశ్‌రావు కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించారు. 

ఆదివారం మెదక్‌లో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గంగాధర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు కౌన్సిలర్లు వై జయశ్రీ, మేడి కల్యాణి, వసంత్‌రాజ్‌, మమత, బొద్దుల రుక్మిణితోపాటు సుమారు 500 మంది కార్యకర్తలు, నాయకులు.. మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సమక్షంలో  టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏఐసీసీ అధినేత రాహుల్‌ గాంధీ ఢిల్లీలో బీజేపీపై పోరాటం చేయమంటే తెలంగాణలోని కాంగ్రెస్‌ లీడర్లు సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. 

ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మాని .. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుల తీరును చూసి ప్రజలు తిట్టుకుంటున్నారన్నారు. 2023లో రాష్ట్రంలో 79 సీట్లు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జి మాణిక్‌ ఠాగూర్‌ కలలు కంటున్నారని తెలిపారు. 2018లో దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 24 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో కనీసం 26 వేల ఓట్లయినా తెచ్చుకుంటుందా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన మరో ముంపు గ్రామం

తొగుట: మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల వారు వరుసగా టీఆర్‌ఎ స్‌కే జైకొడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఎన్ని మాయమాటలు చెప్పినా వినకుండా.. వాస్తవాన్ని గ్రహించి టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తున్నారు. మొన్న పల్లెపహాడ్‌, నిన్న రాంపూర్‌, వేములఘాట్‌ గ్రామాల వారు గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించగా తాజాగా ఆదివారం లక్ష్మాపూర్‌ వాసులు సైతం టీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఓట్లు వేస్తామంటూ లక్ష్మాపూర్‌ వాసులు ఆదివారం మంత్రి హరీశ్‌రావుకు ఏకగ్రీవ తీర్మాన ప్రతిని అందించారు. 

గజ్వేల్‌ పట్టణంలోని సంగాపూర్‌ డబుల్‌ బెడ్రూం ఇండ్ల కాలనీలో మంత్రి హరీశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. ముంపు గ్రామాల వారు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలుస్తుండటంతో ప్రతిపక్ష పార్టీలు బిత్తరపోతున్నాయి. ముంపు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపడంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్తున్నారు. ముంపు బాధితుల త్యాగాలు మరువలేనివని, వారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు.


logo