ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 20, 2020 , 02:22:25

ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రం గోరి

ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రం గోరి

  • పైవేటీకరణే పనిగా పెట్టుకున్న మోదీ సర్కార్‌
  • బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వే, బీపీసీఎల్‌, ఓఎన్జీసీల పరిస్థితేమిటి?
  • ఏటా కోటి ఉద్యోగాలు ఎక్కడ?
  • బీజేపీ నేతలను ప్రశ్నించిన మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తేతెలంగాణ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నరేంద్ర మోదీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని భారతీనగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు. అనంతరం బీహెచ్‌ఈఎల్‌ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు జీ ఎల్లయ్యను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామని చెప్పిన బీజేపీ సర్కార్‌ ఆరున్నరేండ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చిందని ఆ పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌, బీపీసీఎల్‌, ఓఎన్జీసీ వంటి సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. 

ప్రతిష్ఠాత్మకమైన బీహెచ్‌ఈఎల్‌ మూతపడే పరిస్థితి వస్తే తెలంగాణ ప్రభుత్వం రూ.30 కోట్లకు సంబంధించిన యాదాద్రి పవర్‌ ప్రాజెక్టు పనులు అప్పగించిందని మంత్రి గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద 148 మెగావాట్ల పంపు పనులు అప్పగించిందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. అభివృద్ధి పనులే గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రచార అస్ర్తాలన్నారు. మంత్రి హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, కాంత్రికిరణ్‌, ఎమ్మెల్సీ వీ భూపాల్‌రెడ్డి, మాజీ  ఎమ్మెల్యే కే సత్యనారాయణ, ఎఫ్డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు. 

తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన సిట్టింగ్‌ కార్పొరేటర్‌

రామచంద్రాపురం సిట్టింగ్‌ కార్పొరేటర్‌ తొంట అంజయ్య బీజేపీలో చేరిన కొన్ని గంటల్లోనే తిరిగి టీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధిష్ఠానం ఆయనకు టికెట్‌ ఇవ్వకపోవడంతో గురువారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. సాయంత్రం మంత్రి హరీశ్‌రావు రామచంద్రాపురంలోని అంజయ్య ఇంటికి వెళ్లి నచ్చజెప్పడంతో తిరిగి గులాబీ కండువా కప్పుకొన్నారు.

మా మద్దతు టీఆర్‌ఎస్‌కే : జీ ఎల్లయ్య

బీహెచ్‌ఈఎల్‌ కార్మికుల మద్దతు అధికార టీఆర్‌ఎస్‌కే ఉం టుందని ఆ కంపెనీ యూనియన్‌ మాజీ అధ్యక్షుడు జీ ఎల్లయ్య ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు ఎల్లయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య మాట్లాడుతూ.. బీహెచ్‌ఈఎల్‌ ఉద్యోగ, కార్మిక కుటుంబాలన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. బీహెచ్‌ఈఎల్‌ నడ్డి విరిచే ప్రయత్నం చేస్తున్న బీజేపీ సర్కార్‌కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.