శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 15:07:58

బీజేపీ సోష‌ల్ మీడియా పుకార్ల పుట్ట : మ‌ంత్రి హ‌రీష్ రావు

బీజేపీ సోష‌ల్ మీడియా పుకార్ల పుట్ట : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : భార‌తీయ జ‌న‌తా పార్టీ సోష‌ల్ మీడియా పుకార్ల పుట్ట‌.. అబ‌ద్దాల గుట్ట అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు విమ‌ర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాయ‌లో ప‌డొద్ద‌ని దుబ్బాక ఓట‌ర్ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక నేప‌థ్యంలో బుధ‌వారం మ‌హిళా బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో మంత్రి హ‌రీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ జ‌న సందోహాన్ని చూస్తుంటే సోలిపేట సుజాత విజ‌యం ఖాయం అనిపిస్తోంద‌న్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్ర‌తి ఒక్క‌రి మ‌ద్ద‌తు ఉంద‌న్నారు. దుబ్బాక‌పై సీఎం కేసీఆర్‌కు ఎన‌లేని ప్రేమ ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌కు బీడీ కార్మికుల క‌ష్టాలు తెలుసుకాబ‌ట్టే వారికి రూ. 2 వేల పెన్ష‌న్లు ఇస్తున్నార‌ని తెలిపారు. బీడీ కార్మికుల పెన్ష‌న్ల విష‌యంలో బీజేపీ నాయ‌కులు అబ‌ద్దాలు చెబుతున్నార‌ని మండిప‌డ్డారు. 

బండి సంజ‌య్‌కు మ‌రోసారి స‌వాల్‌..

బండి సంజ‌య్‌కు మ‌రోసారి స‌వాల్ విసురుతున్నా.. బీడీ కార్మికుల‌కు కేంద్రం రూ. 1600 ఇస్తున్న మాట నిజ‌మైతే.. దుబ్బాక పాత బ‌స్టాండ్ వ‌ద్ద‌కు చ‌ర్చ‌కు రావాల‌ని హ‌రీష్ రావు డిమాండ్ చేశారు. దుబ్బాకకు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. దుబ్బాక‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అభివృద్ధి చేసింద‌ని తెలిపారు. రూ. 18 కోట్ల‌తో 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని మంజూరు చేశామ‌ని చెప్పారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రైతులకు క‌ష్టాలు తీరాయ‌న్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మ‌ళ్లీ క‌రెంట్, మంచినీటి క‌ష్టాలు వ‌స్తాయ‌న్నారు.  


అభివృద్ధి కొన‌సాగాలంటే సుజాత‌ను గెలిపించాలి

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కొన‌సాగాలంటే సోలిపేట సుజాత‌ను గెలిపించాల‌ని హ‌రీష్ రావు విజ్ఞ‌ప్తి చేశారు. దుబ్బాక ప్ర‌జ‌ల‌కు తాను కూడా అందుబాటులో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఎండ‌మావుల పార్టీల‌ను న‌మ్మొద్దు అని చెప్పారు. మ‌హిళ‌లంద‌రూ కారు గుర్తుకు ఓటేసి.. మీ శ‌క్తిని చూపించాలి అని హ‌రీష్ రావు అన్నారు.

తాజావార్తలు