ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 06, 2020 , 10:00:50

రామలింగారెడ్డి మృతి తీరని లోటు : మంత్రి హరీశ్‌రావు

రామలింగారెడ్డి మృతి తీరని లోటు : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని మంత్రి హరీశ్‌ అన్నారు. ఆయన మరణం ఉమ్మడి మెదక్‌ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటని ట్వీట్‌ చేశారు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజలకోసం పరితపించిన నాయకుడని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా కీలకపోత్ర పోషించారన్నారు. లింగన్న అని ఆత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. అకాల మరణానికి సంతాపం తెలుపుతూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

దిగ్భ్రాంతి కలిగించింది : అసెంబ్లీ స్పీకర్‌

పత్రికారంగంలో తనదైన ముద్రవేసుకున్న ప్రగతి శీల, తెలంగాణ ఉద్యమకారుడు, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణవార్త తనకు తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని అసెంబ్లీ స్పీకర్‌ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని, దుబ్బాక ప్రజలకు, టీఆర్‌ఎస్‌ పార్టీకి తీరని లోటన్నారు. సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ దుబ్బాక ప్రజలకు, రామలింగారెడ్డి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఆత్మకు శాంతి చేకూరాలి : మంత్యి సత్యవతి

దొమ్మాట, దుబ్బాక నియోజక వర్గాల నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచి..  హఠాన్మరణం సోలిపేట రామలింగారెడ్డి మృతి పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేనిలోటు తెలంగాణ రాష్ట్రానికి, నియోజక వర్గానికి పూడ్చలేనిదన్నారు. జర్నలిస్టుగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం 25 ఏండ్లు కొట్లాడారన్నారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో చేరినప్పటి నుంచి పేదల పెన్నిదిగా నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారన్నారు. రామలింగారెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 

నిబద్ధత కలిగిన నేతను కోల్పోయాం : మంత్రి జగదీష్ రెడ్డి

ఉద్యమ మిత్రుడు దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి మరణం పట్ల రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సంతాపాన్ని ప్రకటించారు. తెలంగాణ సమాజం నిబద్ధత కలిగిన నేతను కోల్పోయిందని ఆయన పేర్కొన్నారు. వామపక్ష భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న రామలింగారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇక్కడి ప్రజల అభీష్టం నెరవేర్చిన మహనీయుడని కొనియాడారు.

సంతాపం తెలిపిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల శాసనసభ వ్యవరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం వ్యక్తిగతంగా కలిచి వేసిందన్నారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాలోని దొమ్మాట, దుబ్బాక‌ నియోజక వర్గాల నుంచి  నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబరుడని, ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. జర్నలిస్ట్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సోలిపేట కేసీఆర్‌ నాయకత్వంలో కీలకపాత్ర పోషించారన్నారు. మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

రామలింగన్న సేవలు మరువలేనివి : మంత్రి ఈటల

రామలింగారెడ్డి ఆకస్మిక మరణంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం కలచివేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం మరువలేనిదని, తెలంగాణ రాష్ట్రం కోసం బలంగా ఆకాంక్షించిన వారిలో ఆయన ఒకరన్నారు. పేదల పక్షపాతి అని, నిగర్వి అని, అలాంటి వ్యక్తి మృతి బాధాకరమన్నారు. రామలింగన్న ప్రజలకు, పార్టీకి చేసిన సేవలు మరువలేనివన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

మొదటి టాడా కేసును ఎదుర్కొన్న ధీరుడు : అల్లం నారాయణ

దుబ్బాక శాసన సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్, ప్రజల నాయకుడు సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పక్షాన, అలాగే పీడిత ప్రజల వైపు నిలబడ్డారన్నారు. మొట్టమొదటి టాడాకేసు ఎదుర్కొన్న ధీరుడని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో మొక్కవోని దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని కొనియాడారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo