బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 02:50:17

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ దూకుడు

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ దూకుడు

  • జోరందుకున్న ఉప ఎన్నికల ప్రచారం 
  • గులాబీ పార్టీకి మద్దతుగా పలు గ్రామాల తీర్మానం 
  • విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరుగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ దూకుడు పెంచింది. మంత్రి హరీశ్‌రావుతోపాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతు రంగంలోకి దిగారు. కార్యకర్తలు ఊరూరా విస్తృత ప్రచారం చేపట్టడంతో షెడ్యూల్‌ రాకముందే ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ ప్రాంతాల్లోని ఉప ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నిక కూడా వాటితోనే జరుగనున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి. దుబ్బాక టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కావడం, ఇక్కడి నుంచి నాలుగుసార్లు దివంగత నేత రామలింగారెడ్డి గెలుపొందారు. ఇటీవల హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో లక్ష ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుస్తాడని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దీంతో పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజం వచ్చింది. 

తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం..

సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు జైకొడుతున్నారు. ఇప్పటివరకు తొమ్మిది గ్రామాల వారు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు చేసి ఆ ప్రతులను మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు అందించారు. దౌల్తాబాద్‌ మండలం నర్సంపేట, గువ్వలేగి, దుబ్బాక మండలం చౌదరిపల్లి, ఆరెపల్లి, చిట్టాపూర్‌, రాయపోల్‌ మండలం చౌదరిపాలెం, వీరారెడ్డిపల్లి, ఉదయ్‌పూర్‌, మిరుదొడ్డి మండలం మాదన్నపేట గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 

టీఆర్‌ఎస్‌ విస్తృత ప్రచారం..

దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, రాయపోల్‌ మండలాలు, దుబ్బాక మున్సిపాలిటీ, మెదక్‌ జిల్లాలోని చేగుంట, నార్సింగ్‌ మండలాలు ఉన్నాయి. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఏం చేసిందో విడమరిచి చెబుతున్నారు. యువత, విద్యార్థులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను సోషల్‌ మీడియా ద్వారా వివరిస్తున్నారు. వారం రోజుల్లోనే అన్ని గ్రామాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్ట్‌లను పెట్టడంతోపాటు వాటినే యువకులు తమ స్టేటస్‌గా పెట్టుకుని సంక్షేమ పథకాలను మరింత మందికి తెలిసేలా చేస్తున్నారు. పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన పలువురు ముఖ్యనాయకులు, కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

పనులు బాగా జరిగినయ్‌..

గియ్యల్లా మా ఊర్ల పనులు జరిగినయ్‌ అంటే.. అది ఎమ్మెల్యే రామలింగారెడ్డితోనే. ఇప్పుడు మళ్లొచ్చే ఎలక్చన్లలో టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేసి సీఎం కేసీఆర్‌ సార్‌కు అండగుంటం. అచ్చె ఎన్నికల్లో ఎవ్వలు ఏమి జెప్పినా ఇనేది లేదు. టీఆర్‌ఎస్‌కే నేనోటేత్త. 

- రంగమైన నర్సింలు, రైతు, మిరుదొడ్డి

సారు సాయం మరువలేనిది..

సీఎం కేసీఆర్‌ సార్‌ రైతులకు అన్ని విధాలుగా మేలు జేస్తున్నారు. రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారు. రైతు చచ్చిపోతే రూ.5 లక్షలు బీమా ఇస్తుండు. అందుకే కేసీఆర్‌ సారు మాటే మాకు ధైర్యం. టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలుపుతూ మా ఊరోళ్లం ఏకగ్రీవ తీర్మాన ప్రతిని మంత్రి హరీశ్‌రావుకు ఇచ్చినం.

- పెరమాండ్ల సిద్దులు, నర్సంపేట, దౌల్తాబాద్‌


logo