శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 22:28:58

ఎమ్మెల్యే క్రాంతిపై దాడి హేయమైన చర్య : మంత్రి హరీశ్‌రావు

ఎమ్మెల్యే క్రాంతిపై దాడి హేయమైన చర్య : మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌పై జరిగిన దాడి హేయమైన చర్య అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దళిత ఎమ్మెల్యేపై భౌతికదాడికి దిగడం శోచనీయమన్నారు. పథకం ప్రకారమే బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. దుబ్బాక బీజేపీ ఎన్నికల ఇన్‌చార్జి జితేందర్‌రెడ్డి జిల్లాలో ఉంటే తప్పు కాదా? అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సిద్దిపేటలో ఉంటే తప్పేంటని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శాంతిభద్రతలు దెబ్బతీయాలనీ బీజేపీ నాయకులు చూస్తున్నారని విమర్శించారు.

బీజేపీ కార్యకర్తల దాడికి ముందే పోలీసులు వచ్చి తనిఖీ చేసుకొని వెళ్లారని చెప్పారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి ప్రచార సామగ్రి లభించలేదని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొలేక బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని మంత్రి ఆరోపించారు. కాగా, సిద్దిపేటలో ఓ హోటల్‌లో బస చేసిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ రూమ్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులపై దాడికి ప్రయత్నించారు. నిలువరించిన పలువురు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.