సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 13:45:41

వెనుకబడిన తరగతుల కోసం రూ.4,356.82 కోట్లు

వెనుకబడిన తరగతుల కోసం రూ.4,356.82 కోట్లు

హైదరాబాద్‌: వెనుబడిన తరగతుల సంక్షేమం కోసం ఈ బెడ్జెట్‌లో మొత్తం రూ.4,356.82 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చేనేత కార్మికుల జీవితాల్లో తెలంగాణ ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకురాగలిగింది. నూలు, రసాయనాలు, రంగుల మీద 50శాతం సబ్సిడీ అందిస్తున్నాం. బతుకమ్మ చీరల పనిని అప్పగించడం ద్వారా చేతినిండా పనికల్పిస్తున్నాం. ప్రభుత్వం తరపున జరిపే వస్ర్తాల కొనుగోళ్ల ఆర్డర్లను చేనేత మరమగ్గాల సొసైటీలకే ఇస్తున్నాం. పవర్‌ లూంలను ఆధునీకరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతీ పవర్‌లూం కార్మికుడికి నెలకు రూ.15వేలకు తగ్గకుండా వేతనం పొందే విధంగా పవర్‌లూం యాజమాన్యాలను ఒప్పించాం. 


గొల్ల కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 76 లక్షల 92 వేల 678 గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. వీటి ద్వారా మరో 70 లక్షల 88 వేల గొర్రెపిల్లలు ఉత్పత్తి అయ్యాయి. వాటి ద్వారా రూ.3,189.60 కోట్ల రూపాయల విలువైన సంపద గొల్ల కురుమలకు, రాష్ర్టానికి సమకూరింది. గీత కార్మికుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నాం. నీరాను శీతల పానియంగా అమ్మటం ద్వారా గీత కార్మికుల ఆదాయం పెంచడానికి పాలసీని తీసుకొచ్చినం. చెట్ల పన్నును, పాత బకాయిలను రద్దు చేసినం. హరితహారంలో ఈత, తాటి వనాల పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రమాదవశాత్తూ మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నాం. 


రాష్ట్రంలో చెరువలను పునరుద్ధరించడం, నూతన జలాశయాల నిర్మాణం, 150 కిలోమీటర్ల గోదావరి నదిని సజీవంగా మార్చడం వల్ల మత్స్య పరిశ్రమ అభివృద్ధికి అవకాశాలు పెరిగాయి. 155 కోట్ల 64 లక్షల రూపాయల వ్యయంతో కోట్లాది చేపపిల్లలు, రొయ్య విత్తనాలను పంపిణీ చేసుకున్నాం. దీని వల్ల రాష్ట్రంలో 2016-17లో చేపల దిగుబడి 1.99 లక్షల టన్నుల ఉండగా, 2018-19 సంవత్సరంలో 2.94 లక్షల టన్నులకు దిగుబడి పెరిగింది. ఈ బడ్జెట్‌లో పశుపోషణ, మత్స్యశాఖకు రూ.1586.38 కట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.


 బీసీలకు కల్యాణలక్ష్మి పథకం అమలు చేయడానికి ఈ ఏడాది అదనంగా రూ.650 కోట్లు కేటాయించి, ఈ బడ్జెట్‌ మొత్తం రూ.1350 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎంబీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాం. ఈ బడ్జెట్‌లో ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.500 కోట్ల కేటాయించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించే విధంగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాలకు త్వరలోనే పూర్తి చేసుకుంటామన్నారు. 


logo