బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 22:47:52

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : 42వ జీఎస్టీ ‌ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ ‌కౌన్సిల్ సమావేశం జరగ్గా సమావేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్ నుంచి సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీశ్ రావు  ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ‌ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ పరిహారం  తప్పనిసరిగా పరిహార నిధి నుండే చెల్లించాలని,  సెస్‌తోపాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పని సరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలని అన్నారు. ఆప్షన్ -1, ఆప్షన్ -2 కింద పేర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోంది. దీనిపైన జీఎస్టీ కౌన్సిల్ చర్చించ వచ్చని అన్నారు. ఆప్షన్ 1 లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్ల కు, ఆప్షన్ 2  లో‌ లక్ష 83 వేల కోట్లు కు రివైజ్డ్ చేయడం జరిగింది. వీటి మధ్య అంతరం రూ.73 వేల కోట్లు మాత్రమే. ఇదేమి పెద్ద మొత్తం కాదు. ఆప్షన్- 1 లో పేర్కొన్న పరిహారంతోపాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలని అన్నారు.  సమావేశంలో చత్తీస్‌గఢ్ మంత్రి చెప్పినట్లు  జీఎస్టీ పరిహారం  చెల్లింపు కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదు కాబట్టి దీన్ని తాను కూడా సమర్థిస్తున్నానని అన్నారు.  


logo