శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 04, 2020 , 18:01:29

చెరుకు రైతులకు నష్టం జరగొద్దు : మంత్రి హరీశ్ రావు

చెరుకు రైతులకు నష్టం జరగొద్దు : మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి : చెరుకు రైతులకు ఎలాంటి నష్టం జరగ‌కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని రాష్ట్ర  ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అధికారులకు సూచించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో జహీరాబాద్ చెరుకు రైతుల సమస్యలు, ట్రైడెంట్ చక్కెర పరిశ్రమకు చెల్లించాల్సిన బకాయిలు, ఈ సంవత్సరం క్రషింగ్ నకు సంసిద్ధత, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రైడెంట్ పరిశ్రమ యాజమాన్యంతో ఎప్పుడూ సమస్య వస్తుందని అది చెరుకు సాగుపై ప్రభావం పడుతుందన్నారు. గత సంవత్సరం 1400 మంది రైతులకు రూ.12.70 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. గత నాలుగు నెలలుగా అనేక‌మార్లు యాజమాన్యంతో సమావేశమై మాట్లాడినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింద‌న్నారు. ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వడం లేదని, బకాయిలు చెల్లించడం లేదని, క్రషింగ్ చేయడానికి సిద్ధంగా లేరన్నది  స్పష్టమైందన్నారు. 

రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు..

ఈ సంవత్సరం సాగులో ఉన్న మూడు లక్షల ఎకరాలలో ఉన్న చెరుకును ఏ విధంగా క్రషింగ్ చేయాలన్నది, రైతుల అంగీకారంతో అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రైడెంట్ పరిశ్రమపై చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. జహీరాబాద్ చెరుకు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయంగా గణపతి షుగర్స్, మాగి చక్కెర ఫ్యాక్టరీలతో టై ఆప్ చేసుకుని క్రషింగ్ చేయడానికి అనుమతి ఇస్తామన్నారు. చెరకు క్రషింగ్ ఈనెల 20 నుండి మొదలయ్యే అవకాశం ఉందన్నారు. క్ర‌షింగ్ చేసేందుకు సిద్ధ‌మ‌ని గ‌ణ‌ప‌తి యాజ‌మాన్యం తెల‌ప‌డంతో ఎంత వీలైతే అంత క్ర‌షింగ్ చేయ‌డానికి తీసుకోవాల‌ని మంత్రి ఫ్యాక్ట‌రీ య‌జ‌మాన్యానికి సూచించారు.

జిల్లాలోనే క్రషింగ్ అవుతున్నందున జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ ఉంటుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, కేన్ కమిషనర్ రవీందర్, జహీరాబాద్ నియోజకవర్గ చెరుకు రైతులు తదితరులు పాల్గొన్నారు.