ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 02:40:51

మాంద్యం వల్లే అప్పులు

మాంద్యం వల్లే అప్పులు

  • కేంద్రం మాట వింటే పేదలపై భారం
  • దేశంలోనే అతి తక్కువ అప్పులుచేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణది రెండోస్థానం
  • మండలిలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీకి సంబంధించి రూ.6,016 కోట్లు, ఐజీఎస్టీలో మూడేండ్లకు రూ.2,812 కోట్లు మన హక్కుగా రావాల్సి ఉన్నదని, దీనిపై కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడంలేదని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. కేంద్రం నుంచి రావాల్సిన రూ.10,095 కోట్లు రాలేదన్నారు. కరోనా నేపథ్యంలో ఆయా ప్రభుత్వశాఖల ఉద్యోగుల వేతనాల వాయిదా, తెలంగాణ అప్పుల నిర్వహణ, ఆర్థిక బాధ్యత చట్టం, ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు సడలింపు చట్టం బిల్లులను మంగళవారం శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు. ఈ సంద్భంగా హరీశ్‌ మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా తెలంగాణ సర్కారు 5 నెలల్లో రూ.5 వేల కోట్లు ఖర్చుచేసిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వశాఖల్లో 1.5 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగాయని వివరించారు. ఆర్థిక మాంద్యం వల్లే అప్పులుచేయాల్సి వస్తున్నదని తెలిపారు. రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్‌ రేట్‌ పెరుగుతున్నదని, క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌పై ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక పురోగమనం బాగున్నదని వివరించారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో అప్పులు తీసుకునేందుకు రాష్ర్టాలకు వెసులుబాటు కల్పిస్తూనే బోర్లు, బావుల వద్ద మీటర్లు బిగించాలని, పన్నుల భారం మోపాలని కేంద్రం విధించిన షరతులను సీఎం కేసీఆర్‌ సమ్మతించలేదని చెప్పారు. అతితక్కువ అప్పులుచేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉన్నదన్నారు. కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగానే ఉద్యోగుల వేతనాలను వాయిదా వేస్తున్నామని చెప్పారు. ఆయుర్వేద, యునాని, హోమియోపతి, నేచురోపతి వైద్య కళాశాలల్లోని ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పదవీవిరమణ వయోపరిమితిని పెంచాలని నిర్ణయించామన్నారు. ఈ కళాశాలల్లోని బోధనేతర సిబ్బంది పదవీవిరమణ వయసు పెంచడంలేదని స్పష్టంచేశారు.

ఉన్నత విద్యావకాశాలకు కృషి: మంత్రి సబిత

రాష్ట్రంలోని విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. మండలిలో ప్రైవేటు వర్సిటీల బిల్లును ప్రవేశపెట్టిన ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పరిధిలోని వర్సిటీలను బలోపేతం చేస్తూనే, ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. జీఎస్టీ చట్టానికి సంబంధించి బిల్లును సీఎం కేసీఆర్‌ తరఫున  మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రజలపై ఎటువంటి భారం మోపకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

కోర్టు ఫీజుల చెల్లింపు ఆన్‌లైన్‌లో: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

న్యాయస్థాన ఫీజులు, సమన్ల ఫీజులను సులువుగా ఒకే లావాదేవీలో ఆన్‌లైన్‌లో చెల్లించేలా తెలంగాణ న్యాయస్థాన ఫీజు, దావాల మదింపు చట్టానికి సవరణ తీసుకువస్తున్నట్టు న్యాయశాఖమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శాసనమండలిలో తెలిపారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ప్రతిపాదించినట్టు వివరించారు. సివిల్‌ కోర్టుల చట్టంలోనూ పలు సవరణలు చేసినట్టు వెల్లడించారు. 

85% మందికి టీవీ పాఠాలు

  • విద్యాసంవత్సరం నష్టపోకుండా డిజిటల్‌ క్లాసులు
  • శాసనమండలిలో విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. ఈ నెల 21 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంగళవారం శాసనమండలిలో ఆన్‌లైన్‌ క్లాసులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. గ్రామాల్లో పిల్లలందరికీ పాఠాలు చేరేలా దూరదర్శన్‌ ద్వారా డిజిటల్‌ క్లాసులను అందుబాటులోకి తెచ్చామన్నారు. డిజిటల్‌ పాఠాలతో 7 నుంచి 10వ తరగతి వరకు దాదాపు 17.27 లక్షల (85%) మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతున్నదని చెప్పారు.టీసాట్‌ ద్వారా కూడా డిజిటల్‌ క్లాసులు ప్రసారం చేశామని తెలిపారు. తరగతులవారీగా పాఠాలు వినడం కోసం 43,108 వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటుచేశామని చెప్పారు. 86 వేల మంది తల్లిదండ్రులు డిజిటల్‌ క్లాసులపై సంతృప్తి వ్యక్తంచేశారని అన్నారు.

నాలుగో విడుత రుణమాఫీకి చర్యలు

164 కోట్ల బకాయిలు భరించాం: మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నాలుగో విడుత రుణమాఫీకి చర్యలు కొనసాగుతున్నాయని, ఈ విషయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సానుకూలంగా ఉన్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ...2013-14లో గత పాలకులు వదిలేసిన బకాయిలు రూ.164.61 కోట్లను కూడా భరించామని వెల్లడించారు. రైతుబంధు కోసం రూ.7,273 కోట్లు చెల్లించామన్నారు. యాసంగికి కూడా దాదాపు రూ.6కోట్ల నుంచి రూ.7కోట్ల వరకు ఖర్చు వచ్చే అవకాశాలు ఉన్నాయని, మొత్తంగా 15వేలకోట్ల వరకు ఖర్చు వస్తుందన్నారు.

40 ఇండ్లు ఉన్నా పంచాయతీగా మార్చాం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కొన్ని జిలాల్లో 30 నుంచి 40 ఇండ్లు ఉన్న చిన్న చిన్న ఆవాసాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా అధికారాలు ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదని వివరించారు. గ్రామాల అభివృద్ధికి రూ.3,795 కోట్లు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

ట్రాఫిక్‌ ఇబ్బంది తగ్గింది... హోంమంత్రి మహమూద్‌ అలీ

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 11 జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు లేవని, అయినా సివిల్‌ పోలీసులను ట్రాఫిక్‌ విధుల నిర్వహణకు ఉపయోగించుకుంటున్నామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. మండలి సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. సివిల్‌ పోలీసులు మెదక్‌ జిల్లా ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారని వెల్లడించారు.


logo