మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 03:06:45

సుస్థిరాభివృద్ధిలో టాప్‌

సుస్థిరాభివృద్ధిలో టాప్‌
  • ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారమే అప్పు
  • గణనీయంగా పెరిగిన తలసరి ఆదాయం
  • సంక్షేమానికి ఒక్కరూపాయీ తగ్గించలేదు
  • కాంగ్రెస్‌ భ్రమలను బడ్జెట్‌ బద్దలుకొట్టింది
  • బడ్జెట్‌పై జనంలో ఆశ.. ప్రతిపక్షాల్లో నిరాశ
  • బడ్జెట్‌పై చర్చకు మంత్రి హరీశ్‌ సమాధానం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే అప్పు తెస్తున్నామని, జీఎస్డీపీ వృద్ధిరేటును బట్టే రుణాలు వస్తాయని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. అవగాహనలేకే అప్పుల రాష్ట్రం అంటూ ప్రతిపక్షాలు హేళన చేస్తున్నాయని విమర్శించారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు కాదని ఎక్కడా అప్పు చేయలేదని పేర్కొన్నారు. దేశంలోని 19 రాష్ర్టాలు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలను పాటించకుండా ఎక్కువ అప్పు తీసుకున్నాయన్నారు. జీఎస్డీపీ పెరిగితే రుణ పరిమితి కూడా పెరుగుతుందన్న మంత్రి గోబెల్స్‌ ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు హితవుపలికారు. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం రుణాలు తీసుకున్న రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో దిగువ నుంచి మనది ఆరోస్థానమని చెప్పారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ల విషయంలో కోర్టు కేసులకు కూడా వన్‌టైం సెటిల్‌మెంట్‌ కల్పిస్తామన్నారు. బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి గురువారం శాసనసభలో సమాధానమిచ్చారు. నాలుగు కోట్ల మంది ప్రజలు బడ్జెట్‌పై సంతోషంగా ఉంటే ప్రతిపక్షాలు మాత్రం నిరాశలో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా భ్రమల్లో పెట్టే బడ్జెట్‌ తమది కాదని, సీఎం కేసీఆర్‌ మార్గదర్శకంలో రూపొందిన బడ్జెట్‌ కాంగ్రెస్‌ భ్రమలను బద్దలు కొట్టిందని చెప్పారు. మాంద్యంలోనూ సంక్షేమానికి రూపాయి తగ్గించలేదని స్పష్టంచేశారు.


మన రైతుబంధు ఆదర్శం

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ 82 పాయింట్లతో తొలిస్థానంలో ఉన్నట్టు స్వయంగా నీతి ఆయోగ్‌ వెల్లడించిందని మంత్రి హరీశ్‌ వివరించారు. రైతుబంధును ఆదర్శంగా తీసుకున్న కేంద్రం పెట్టుబడి వ్యయం కింద 12% బడ్జెట్‌లో పెడితే.. తెలంగాణలో 30% పెట్టామని తెలిపారు. పదేండ్ల కింద 13.56 శాతం ఉన్న వృద్ధిరేటు ఇప్పుడు 21.47కు పెరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ. 54,052గా ఉన్న తలసరి ఆదాయం.. రూ.2,11,800కు పెరిగిందన్నారు. ఉమ్మడి పాలనలో పెట్టుబడుల వ్యయం రూ.1,29,683 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.2,11,800 కోట్లు ఉన్నదని తెలిపారు. జీఎస్‌డీపీ గతంలో రూ.8,57,364 కోట్లు ఉంటే, రూ.9,69,604 కోట్లకు చేరిందని వివరించారు.


ఇసుక ఆదాయం పెరిగింది

ఉమ్మడి పాలనలో ఏటా ఇసుక మీద రూ.10 నుంచి రూ.12 కోట్లు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.800 కోట్లకు చేరిందని మంత్రి హరీశ్‌రావు వివరించారు. స్వగృహ, దిల్‌ ఆస్తులను అమ్ముతామని బహిరంగంగానే చెప్తున్నామన్నారు. కోకాపేట వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం కేసులు గెలిచిందని, ఆ భూములను కూడా అమ్ముతామని స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి పదేండ్లలో రూ. 1,42,792 కోట్లు కేటాయించారని, ఇందులో అధిక శాతం ఆంధ్రాకే ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాల్లో సాగునీటిరంగానికి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. రైతుబంధుకు బడ్జెట్‌లో గతం కంటే రూ.2 వేల కోట్లు అదనంగా కేటాయించామని వివరించారు. 2014-15లో 34,96,087 ఎకరాల్లో వరి సాగుచేస్తే.. ప్రస్తుతం 78,46,619 ఎకరాలకు పెరిగిందని చెప్పారు. 2014-15లో 68,16,662 టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, రూ.9,270 కోట్ల ఆదాయం వచ్చిందని, 2019-20లో 2,23,18,576 టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా, రూ.40 వేల కోట్లు వచ్చాయని తెలిపారు.


పేదవర్గాలకు అండ

ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు పదేండ్లలో రూ.5,558 కోట్లు పెన్షన్ల కింద ఇచ్చారని, తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదున్నరేండ్లలో రూ. 42,470 కోట్లు ఖర్చు పెట్టిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఐటీరంగానికి సమైక్య పాలనలో పదేళ్లలో రూ.5,644 కోట్లు కేటాయిస్తే, ఈ ఐదున్నరేండ్లలో రూ.4,389 కోట్లు ఖర్చు చేశామన్నారు. సింగరేణి కార్మికులకు పదేండ్లలో రూ.9,571 కోట్లను రాయల్టీగా ఇస్తే, ఈ ఐదేండ్లలో రూ.13,105 కోట్లను రాయల్టీగా ఇచ్చామని పేర్కొన్నారు. విద్యుత్‌రంగంలో ఎనలేని ప్రగతిని సాధించామన్నారు. గతంలో హైదరాబాద్‌ గాంధీ, వరంగల్‌ ఎంజీఎం దవాఖానల్లో మాత్రమే డయాలసిస్‌ సేవలు ఉండేవని, స్వరాష్ట్రంలో 40 డయాలసిస్‌ కేంద్రాలు, 20 ఐసీ యూ యూనిట్లు ఏర్పాటుచేశామని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వాహనాలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయని వివరించారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణలక్షి, షాదీముబారక్‌ పథకం ద్వారా రూ. 1,00,116 ఇస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించామని, మూసీ ప్రక్షాళనచేసి కానుకగా ఇస్తామన్నారు. 


కాంగ్రెస్‌ పాలనలో గృహ నిర్మాణాల పేరుతో ప్రజలకు అప్పులు మిగిల్చారని, కానీ సీఎం కేసీఆర్‌ రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఐటీరంగంలో తెలంగాణ గ్రోత్‌ సాధించిందని, టీహబ్‌ను ప్రపంచమే హర్షించిందన్నారు. ఈ ఐదేండ్లలో 43 ఐటీ పార్కులు, రూ.1,25,578 కోట్ల పెట్టుబడులు, 9,71,106 మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. విద్యారంగానికి రూ. 16,450 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నా రు. 2014 వరకు 298 గురుకులాల్లో 1,45,254 మంది విద్యార్థులు ఉండేవారని, ఇప్పుడు 671 గురుకులాల్లో 4,41,497 మంది విద్యార్థులున్నారని వివరించారు. సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నామని, ప్రతిపక్ష నేతలంతా అక్కడికి వెళ్లి తిని రావాలని సూచించారు. ఇప్పటివరకు 1,52,260 ఉద్యోగాలకు అనుమతి తీసుకున్నామని, వాటిలో 1,32,889 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీచేశామని చెప్పారు. ఇందులో 1,23,075 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. త్వరలోనే వర్సిటీల్లో పోస్టులను భర్తీచేస్తామని ప్రకటించారు. ఎంఐఎం కోరినట్టు మూసీ, హైదరాబాద్‌ అభివృద్ధిపై తప్పకుండా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నిర్ణయాత్మకమైన సూచనలు చేస్తే స్వీకరిస్తామని, కేవలం ఆరోపణలు చేయడమే లక్ష్యంగా మాట్లాడితే ప్రజలే గుణపాఠం చెప్తారని ప్రతిపక్షాలకు సూచించారు.


logo
>>>>>>