ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 19:05:19

బండి సంజయ్‌పై మంత్రి గంగుల ఫైర్‌

బండి సంజయ్‌పై మంత్రి గంగుల ఫైర్‌

కరీంనగర్‌ : సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు. కరీంనగర్‌ నగర పాలక సంస్థలోని 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ.. మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కార్పొరేటర్‌కు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి.

ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌, దత్తాత్రేయ లాంటి వారు కూడా ఏనాడూ సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో విమర్శించలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ప్రధాని మోదీ కూడా గౌరవించి మాట్లాడుతారు. కానీ బండి సంజయ్‌ మాత్రం సీఎంపై ఇష్టమొచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ఏకవచనంతో విమర్శించడం సరికాదన్నారు. విమర్శించినంత మాత్రాన గొప్ప నాయకులం అయిపోతామనుకోవడం పొరపాటు అని మంత్రి అన్నారు. కరీంనగర్‌ ఎంపీగా గెలిచిన సంజయ్‌.. ఇప్పటి వరకు అభివృద్ధిపై దృష్టి సారించలేదని గంగుల కమలాకర్‌ ధ్వజమెత్తారు. 

కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ మాట్లాడుతూ.. డివిజన్‌ ప్రజలందరూ టీఆర్‌ఎస్‌లో చేరాలని చెప్పడంతోనే గులాబీ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. మంత్రి ప్రజల మధ్యలో ఉండి అభివృద్ధిపై దృష్టి సారిస్తే.. బండి సంజయ్‌ మాత్రం కనీసం కార్యకర్తలను, ప్రజలను పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీ అనాథగా మారిందన్నారు జయశ్రీ. 


logo