బుధవారం 03 జూన్ 2020
Telangana - May 05, 2020 , 00:48:29

పంట కొనుగోళ్లలో రికార్డు

పంట కొనుగోళ్లలో రికార్డు

  • తెలంగాణలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు
  • ఎఫ్‌సీఐ నిర్దేశించిన నాణ్యతాప్రమాణాలు అమలు
  • గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం
  • బీజేపీ నేతలకు ఎఫ్‌సీఐ నిబంధనలు మార్చే దమ్ముందా? 
  • ‘నమస్తే తెలంగాణ’తో పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల ఎకరాల్లో వరి సాగయిందని, తాజా అంచనాల ప్రకారం 117 లక్షల టన్నుల దిగుబడి రానున్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇందులో సీడ్స్‌, ఇతర అవసరాలనిమిత్తం 20లక్షల టన్నులుపోను 97 లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఇంత పెద్దమొత్తంలో ధా న్యం రావడం, కొనుగోలు చేయడం చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. సోమవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. 

6,514 కొనుగోలు కేంద్రాలు 

భారీఎత్తున తరలివస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6,514 కేంద్రాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఈ నెల 4 వరకు 5,970 కేంద్రాలను ప్రారంభించామని, వీటిద్వారా సోమవారం వరకు రూ.4,890.67కోట్ల విలువైన 28.02 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేశామన్నారు. ఇప్పటికే రూ.2,443.32 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వివరించారు. గతేడాది యాసంగిలో 18.56 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ఈసారి 39 లక్షల ఎకరాల్లో సాగయిందని, అపర భగీరథుడు కేసీఆర్‌ అందించిన సాగునీటితో ప్రతిరైతు ఇల్లు ధా న్యపుసిరులతో తులతూగుతున్నదని చెప్పా రు. గతంలో ఏప్రభుత్వమూ అమలుచేయని విధంగా అన్నదాతలకు అందుబాటులోనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కొవిడ్‌- 19 నుంచి రైతులను రక్షించేందుకు ఒకేసారి కేంద్రం వద్దకు ధాన్యం తీసుకురాకుండా ముందుగానే కూపన్లు జారీచేసినట్టు తెలిపారు. కేంద్రాల వద్ద కరోనా వ్యాప్తి చెందకుండా అన్నిఏర్పాట్లూ చేశామని తెలిపారు.

గన్నీ బ్యాగుల కొరతను అధిగమించాం

యాసంగి ధాన్యం కోసం 18.22 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా, 14.11 కోట్ల బ్యాగులు అందుబాటులో ఉన్నాయని మం త్రి గంగుల తెలిపారు.  గన్నీ సంచులు అధికంగా పశ్చిమబెంగాల్‌ నుంచి దిగుమతి అవుతుంటాయని, అయితే కరోనాతో అక్కడ పరిశ్రమలు మూతపడటంతో తీవ్రమైన కొరత ఏర్పడిందని తెలిపారు. గన్నీ సంచులు రాలేని పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ సంచులను వాడేందుకు అనుమతి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తితో కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.అయినప్పటికీ బ్యాగుల కొరతను అధిగమించడానికి మిల్లర్ల వద్దకు పంపిన ధాన్యాన్ని సాధ్యమైనంత మేర వెంటవెంటనే ఖాళీచేయించి.. వాటిని మళ్లీ రైతులకు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. అలాగే చౌకధరల దుకాణాలకు పంపి న బియ్యానికి సంబంధించిన ఖాళీ బ్యాగులు, ఒకసారి వాడిన బ్యాగులను మళ్లీ వినియోగంలోకి తెస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలకు కండ్లుమండుతున్నయ్‌..

రైతుల కల్లాల్లో ధాన్యం రాశులు చూసి ప్రతిపక్షాల కండ్లు మండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు. నీరు, కరంటు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చిన ప్రభుత్వమే.. మద్దతు ధరకు ప్రతిగింజనూ కొంటుండడంతో.. ప్రతిపక్షాలు ఉనికి కోల్పోతామనే భయంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఎఫ్‌సీఐ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే ఏ ప్రభుత్వమైనా పంటలను కొనుగోలు చేస్తుందని, వాటిని నిర్దేశించేది కేంద్రమే అని చెప్పారు. దశాబ్దాల క్రితం ప్రమాణాలనే కేంద్రం నేటికీ అమలుచేస్తున్నదని దుయ్యబట్టారు. బీజేపీ నాయకులు ఈ విషయంపై ఎప్పుడైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? నిలదీశారా? అని ప్రశ్నించారు. తాలు, తరుగు పేరిట రాజకీయాలు చేస్తున్న బీజేపీ నేతలకు దమ్ముంటే ప్రమాణాలు మార్చాలంటూ ముందుగా కేంద్రంపై ఒత్తిడితేవాలని సవాల్‌ విసిరారు.


logo