శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 15:23:59

కరీంనగర్‌ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా

కరీంనగర్‌ ప్రజలకు మంత్రి గంగుల కమలాకర్‌ భరోసా

కరీంనగర్‌ : కరీంనగర్‌లో కరోనా నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంత్రి నేడు కరీంనగర్‌ పట్టణంలో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. నగరం మొత్తం శానిటైజేషన్‌ చేపడుతున్నట్లు తెలిపారు. మన నగర భవిష్యత్‌ మన చేతుల్లోనే ఉందని.. మన నగరాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ప్రజలంతా సాధ్యమైనంత వరకు ఇండ్లకే పరిమితం కావాలన్నారు. రోడ్లపై గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించాలన్నారు. అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందిగా సూచించారు. 


విదేశాల నుంచి వచ్చిన వారి సమాచారం తెలియజేయడం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినవారౌతరన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రజల సహకారంతోనే వైరస్‌ను నిర్మూలించడం సాధ్యమన్నారు. ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో తప్ప ఇప్పటి వరకు కొత్తవారిలో ఎవరిలోనూ కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు. అయినప్పటికి మరో పది రోజులు అంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. విదేశాల నుంచి వచ్చినవారు 15 రోజులు ఇంట్లోని ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనారోగ్య సమస్యలను, జబ్బులను దాచే ప్రయత్నం చేయొద్దన్నారు.





logo