మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 19:13:11

పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు : మంత్రి ఈటల

పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవు : మంత్రి ఈటల

హైదరాబాద్‌ : కోవిడ్‌-19 రోగుల విషయంలో ప్రైవేటు ఆస్పత్రులు పద్దతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరించారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ... ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. సంపాదించుకోవడానికి ఇది సమయం కాదన్నారు. ప్రజలను భయపెట్టి లక్షల రూపాయలు వసూలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఓ ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనా పరిస్థితిని వ్యాపార కోణంలో చూడొద్దని ప్రైవేటు ఆస్పత్రులకు చెప్పామన్నారు. మానవత్వంతో సాటి మనిషికి సహాయం చేయాలని కోరామన్నారు. చిన్న వైద్యానికే రూ.లక్షల బిల్లులు వసూలు చేయడం హీనమైన చర్య అన్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల చర్య మానవాళికే కళంకం తెచ్చేలా ఉందన్నారు. ఎన్నోసార్లు ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించామని ఇప్పటికి మరకపోతే ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తామన్నారు. రోజుకు గరిష్ఠంగా రూ. 9 వేలకు మించి తీసుకోవద్దని ప్రైవేటు ఆస్పత్రులకు చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. 

హితం యాప్‌ ద్వారా విశ్రాంత వైద్యుల సలహాలు..

హితం అనే యాప్‌ ద్వారా విశ్రాంత వైద్యులు వైద్య సలహాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. లక్షణాలు లేకుండా కేవలం అనుమానంతో పరీక్షలు చేయించుకోవదన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత లేదన్నారు. రోగం ముదిరిన తర్వాత ఆక్సిజన్‌ పెట్టినా ప్రయోజనం ఉండటం లేదన్నారు. దశలవారీగా అన్ని వైద్య కళాశాలల్లో కరోనా రోగులకు బెడ్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి ముదిరిన తర్వాత ఏ ఆస్పత్రికి వెళ్లినా ఫలితం ఉండదన్నారు. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. 

ప్లాస్మా థెరపీపై కొన్ని ఆంక్షలు ఉన్నాయని పైగా అది అందరికీ అవసరం ఉండదన్నారు. పరిస్థితి విషమించినవారు మాత్రమే గాంధీ ఆస్పత్రికి వస్తున్నారన్నారు. గాంధీలో 550 చొప్పున ఐసీయూ, ఆక్సిజన్‌ సదుపాయం గల పడకలు ఉన్నాయన్నారు. గాంధీలో దాదాపు 50 శాతం పడకలకు ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ సదుపాయం ఉన్నట్లు తెలిపారు. కేంద్రాన్ని 1400 వెంటిలేటర్లు కోరితే ఇప్పటివరకు దాదాపు 900 వెంటిలేటర్లు వచ్చాయన్నారు. పీహెచ్‌సీ స్థాయిలో కూడా చికిత్స అందుబాటులో ఉందని కరోనాకు అవసరమైన మందులన్నీ పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రూ.వెయ్యిలోపు మందులతోనే కరోనా నుంచి కోలుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు.


logo