శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:29

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం

రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోం

  • జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులకు మంత్రి ఈటల రాజేందర్‌ హెచ్చరిక 

జమ్మికుంట/కమలాపూర్‌: పత్తి రైతుకు మద్దతు ధర ఇవ్వాలని, 90 శాతం పత్తి కొనుగోలు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సీసీఐకి విజ్ఞప్తి చేశా రు. నాణ్యతా ప్రమాణాల పేరిట మార్కెట్‌కు వచ్చిన పత్తి ని తిరస్కరించవద్దని సూచించారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని జిన్నింగ్‌ మిల్లుల నిర్వాహకులను హెచ్చరించారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపెల్లి, మర్రిపెల్లిగూడెం, వంగపల్లి, శంభునిపల్లి, కానిపర్తి, దేశరాజ్‌పల్లి, ఉప్పల్‌, ఉప్పలపల్లిలో ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. అకాల వర్షా లు అన్నదాతను కుంగదీశాయనీ, చీడపీడల కారణంగా దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉన్నదన్నారు. ఈ దశలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. మరో వారంలో నాణ్యమైన పత్తి మార్కెట్‌కు రానున్నదని, ఇక్కడి పత్తికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో పేరుందని చెప్పారు. కాగా తరుగులేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.