శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Sep 10, 2020 , 03:52:13

వైరస్‌ రాకముందే అప్రమత్తం

వైరస్‌ రాకముందే అప్రమత్తం

  • రాష్ట్రంలో తొలి కరోనా కేసు రాగానే కట్టుదిట్టమైన చర్యలు
  • అసెంబ్లీలో కొవిడ్‌-19పై చర్చలో మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ దేశంలోకి ప్రవేశించిందనే సమాచారం అందిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైందని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. కరోనా పరీక్షలు చేయడానికి, వైరస్‌ సోకిన వెంటనే చికిత్స అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. అసెంబ్లీలో బుధవారం కొవిడ్‌-19పై జరిగిన స్వల్పకాలిక చర్చను మంత్రి ఈటల ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం, దాని నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. 

రికవరీ ఎక్కువ.. మరణాలు తక్కువ

‘ఈ నెల 7వ తేదీ నాటికి తెలంగాణలో 1,45,163 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,12,587 మంది కోలుకోగా, 24,579 మంది ఐసొలేషన్‌లో ఉన్నారు. 7,091 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుంటే, 906 మంది మరణించారు. రాష్ట్రంలో కేసుల రికవరీ రేటు జాతీయస్థాయికి సమానంగా 77.6 శాతం ఉంది. అదే మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.7 శాతం ఉంటే, తెలంగాణలో 0.62 శాతం మాత్రమే ఉంది. దేశం మొత్తంలో 72,830 మరణాలుంటే, 27,027తో మహారాష్ట్ర తొలిస్థానంలో, 906 మరణాలతో తెలంగాణ 12వ స్థానంలో ఉంది’ అని ఈటల వివరించారు. 

ఇతర రాష్ర్టాల కంటే ముందు..

‘కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఇతర రాష్ర్టాలకన్నా ముందే సీఎం కేసీఆర్‌ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుచేశారు. మార్చి 14న పాక్షిక లౌక్‌డౌన్‌ ప్రకటించి విద్యాసంస్థలు, కోచింగ్‌ సెంటర్లు, సమ్మర్‌ క్యాంపులు, సినిమా హాళ్లు, బార్లు, క్లబ్‌లు, ఫంక్షన్‌హాళ్లు మూసివేయాలని నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చిన వారితోనే వైరస్‌ వ్యాప్తి చెందుతున్నదని గుర్తించి సీఎం కేసీఆర్‌ కేంద్రానికి చెప్పి విమానాలను బంద్‌ చేయించారు. తెలంగాణలో మొట్టమొదట ఇండొనేషియా నుంచి కరీంనగర్‌ పట్టణానికి వచ్చిన విదేశీయుల్లో ఈ వైరస్‌ కనిపించింది. కరోనా వైరస్‌ సోకిన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా మార్చే పద్ధతిని మన రాష్ట్రమే ముందుగా ప్రారంభించింది. అంతేకాదు ఢిల్లీలో ఓ ప్రార్థనా మందిరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నవారి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న విషయాన్ని తొలుత గుర్తించి, కేంద్రాన్ని అప్రమత్తం చేసింది కూడా మనమే. శాంపిల్స్‌ను పుణేకు పంపి పరీక్షించే దుస్థితి నుంచి గాంధీ, ఉస్మానియా, ఐపీఎం, సీసీఎంబీ, నిమ్స్‌, కాకతీయ వైద్య కళాశాలలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్థితికి చేరుకున్నాం. ప్రస్తుతం పీహెచ్‌సీల స్థాయిలోనూ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం’ అని మంత్రి చెప్పారు.

ప్రభుత్వ దవాఖానల్లో ఖరీదైన మందులు

కరోనా చికిత్సకు అన్ని ప్రభుత్వ దవాఖానల ద్వారా ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని మంత్రి ఈటల రాజేందర్‌ శాసనమండలిలో చెప్పారు. ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఫెవిపిరవిర్‌ (ఫాబిఫ్లూ) 2,52,348 పరిమాణంలో, రెమ్‌డెసివిర్‌ 32,800 పంపిణీ చేశామన్నారు. అలాగే ఇప్పటివరకు కొవిడ్‌ పేషంట్లకు 2,06,949 ఫెవిపిరవిర్‌ టాబ్లెట్లు, 24,408 రెమ్‌డెసివర్‌ ఇంజెక్షన్లు ఇచ్చామన్నారు. ఇవి కొత్త ఔషధాలు కాబట్టి కచ్చితమైన ఫలితాలు మదింపు కాలేదన్నారు. కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తికి సంబంధించి స్వల్ప    కాలిక చర్చలో సమగ్రంగా చర్చిద్దామని చెప్పారు.

ఆరోగ్యశ్రీలో చేర్చాలి: సీఎల్పీ నేత భట్టి

 కరోనా వైద్య చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ‘ప్రైవేటు దవాఖానలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా బాధితులుగా ఉంటున్నారు. కార్పొరేటు, ప్రైవేటు దవాఖానల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనాతో చిరు వ్యాపారులు, చిరుద్యోగులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం ప్రభుత్వ పరంగా ఏదైనా చేయాలి. ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లను నియమించాలి, వసతులను పెంచాలి’ అని సూచించారు.

‘ఉస్మానియా’ కూల్చివేతకు వ్యతిరేకం కాదు: అక్బరుద్దీన్‌

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ మాట్లాడుతూ.. ‘ఉస్మానియా దవాఖాన భవనం కూల్చవేతకు మేం వ్యతిరేకం. కరోనా చికిత్స విషయంలో ప్రజలకు ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం కలిగించాలి. ఇతర చిక్సితలకు ఆరోగ్యశ్రీ ఉన్నా కరోనా టెస్టు కోసం డబ్బులు కట్టాల్సి వస్తున్నది. ఆర్టీసీపీఆర్‌ టెస్టుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చాలి. లాక్‌డౌన్‌ కాలానికి మార్కెట్‌ ఫీజు వసూ లు చేయవద్దు. ఇలాంటి ఇతర ట్యాక్సులను మినహాయించాలి’ అని కోరారు.


logo