బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 01:51:12

కరోనా లేదు.. ఆందోళన వద్దు

కరోనా లేదు.. ఆందోళన వద్దు
  • రాష్ట్రంలో ఏ ఒక్కరికీ వ్యాధి సోకలేదు
  • మండలిలో మంత్రి ఈటల వెల్లడి
  • సీఎం కేసీఆర్‌ను అభినందించిన మండలి చైర్మన్‌, సభ్యులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనావ్యాధి లేనేలేదని, రాష్ట్రంలో ఇంతవరకు ఒక్కరికి కూడా ఆ వైరస్‌ సోకలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. ప్రజ లు భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. వదంతులను నమ్మవద్దని, ఒకవేళ ఎవరికైనా కరోనా సోకినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. శాసనమండలిలో శనివారం కరోనా వైరస్‌పై కొనసాగిన చర్చ సందర్భంగా పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. దుబాయినుంచి వచ్చిన ఒకే వ్యక్తికి కరోనా వైరస్‌ సోకిందని, అతడికి గాంధీ దవాఖానలో చికిత్స అందించామని తెలిపారు. వ్యాధినుంచి పూర్తిగా కోలుకున్న ఆ వ్యక్తి శుక్రవారం సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యాడని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి వ్యాధినివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందించామన్నారు. విదేశాల నుంచి వచ్చేవారి ద్వారా వ్యాధివ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఎయిర్‌పోర్టులో ప్రయాణికులను స్కానింగ్‌ చేస్తున్నామన్నారు. 


సీఎం కేసీఆర్‌ చర్యలు అభినందనీయం

కరోనా వైరస్‌ను నివారించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న ముందుజాగ్రత్త చర్యలు అభినందనీయమని శాసనమండలి చైర్మన్‌ సహా సభ్యులు ప్రశంసించారు. కరోనా అంశంపై జరిగిన చర్చలో సభ్యులు యెగ్గె మల్లేశం, నవీన్‌కుమార్‌, చిన్నపరెడ్డి, ఆకుల లలిత, ఫారూఖ్‌హుస్సేన్‌, గంగాధర్‌గౌడ్‌, ఎంఎస్‌ ప్రభాకర్‌, జీవన్‌రెడ్డి, ఎస్‌ రామచందర్‌రావు, రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, జాఫ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ సోకకుండా దవాఖానలను అప్రమత్తం చేయడం, ప్రజలకు అవగాహనలు కల్పించడం వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.


కేసీఆర్‌ కిట్‌ గొప్ప పథకం

కేసీఆర్‌ కిట్‌ గొప్ప పథకమని, రాష్ట్రంలో దీనిద్వారా ఫిబ్రవరి చివరినాటికి 6,47,823 మంది లబ్ధిపొందారని మంత్రి ఈటల అన్నారు. ఇందుకు రూ.826 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ ప్రారంభించిననాటికి ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు 51 శాతానికి పెరిగాయని పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈటల సమాధానమిచ్చారు. ఆడబిడ్డలకు తొలుసూరు కాన్పును ప్రభుత్వమే చేయడం గొప్ప విషయమన్నారు.


logo