సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 02:21:26

45 డయాలసిస్‌ కేంద్రాలు

45 డయాలసిస్‌ కేంద్రాలు
  • రాష్ట్రవ్యాప్తంగా 22 ఐసీయూలు
  • ప్రశ్నోత్తరాల్లో మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పేద కిడ్నీ బాధితులకు వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనతో డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 45 డయాలసిస్‌ కేంద్రాలు పనిచేస్తున్నాయని, ప్రభుత్వ దవాఖానల్లోనూ ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్‌ సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం అవసరమైతే మరిన్ని సెంటర్ల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల సమాధానమిస్తూ.. ఒక్కో కిడ్నీ రోగికి ఏడాదికి రూ.1.2 లక్షలు ఖర్చుచేస్తే తప్ప జీవించడం కష్టమని, అంత ఖర్చు చేయలేని ఎంతోమందికి డయాలసిస్‌ సెంటర్ల ద్వారా వైద్యం అందిస్తున్నామన్నారు. 


ఐసీయూల ఏర్పాటుపై ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, డాక్టర్‌ ఎం సంజయ్‌, డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అడిగిన ప్రశ్నలకు ఈటల స్పందిస్తూ.. ప్రభుత్వ దవాఖానలు, ఏరియా దవాఖానల్లో ప్రభుత్వ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు (ఐసీయూ)ను ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.41.12 కోట్లతో 22 చోట్ల ఐసీయూలు నెలకొల్పినట్టు పేర్కొన్నారు. త్వరలోనే టెక్నికల్‌, నర్సింగ్‌ సిబ్బంది భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అడిగిన ప్రశ్నకు ఈటల సమాధానమిస్తూ.. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కరోనా అంశంపై సభలో స్వల్పకాలిక చర్చను పెట్టాలని కోరారు.


logo