శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 04, 2020 , 03:03:29

రోగులే మనకు వీఐపీలు

రోగులే మనకు వీఐపీలు

  • వారిని ఆప్యాయంగా పలుకరించాలి
  • జిల్లాల్లోనే 90 శాతం మందికి వైద్యం
  • ఖాళీ పోస్టులను వెంటనే భర్తీచేయాలి
  • ఆయుష్‌కు పూర్వవైభవం తెద్దాం
  • వైద్యారోగ్యశాఖ సమీక్షలో మంత్రి ఈటల

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రభుత్వ దవాఖానల్లో రోగులే వీఐపీలు.. వారికి వైద్యమందించడం ఎంతముఖ్యమో.. ఆప్యాయంగా పలుకరించడమూ అంతే ముఖ్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అందిస్తున్న చికిత్సవివరాలను ఎప్పటికప్పుడు రోగితోపాటు, బంధువులకూ తెలియజేయాలన్నారు. అందుకోసం ప్రతిదవాఖానలో రిసెప్షన్లను ఏర్పాటుచేసి సహాయకులను నియమించాలని ఆదేశించారు. పెద్ద జబ్బులున్న వారిని మాత్రమే హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా దవాఖానలకు రెఫర్‌ చేయాలని.. 90 శాతం మందికి జిల్లా దవాఖానల్లోనే వైద్యసేవలందించాలని సూచించారు. శనివారం వైద్యారోగ్యశాఖను పటిష్ఠం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల పలు ఆదేశాలు జారీచేశారు. కరోనా సమయంలో ఆయుష్‌వైద్యానికి ప్రాధాన్యం పెరిగిందని.. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన మందులను మరింతగా అందుబాటులో ఉంచాలని సూచించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు అమలుకాకపోవటంపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈటల.. సత్వరచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, నేచురోపతి, యోగా విభాగాల్లో టీచింగ్‌పోస్టులను వెంటనే భర్తీచేయాలని చెప్పారు. ఆయుష్‌ డిస్పెన్సరీ సెంటర్లను వెల్‌నెస్‌ సెంటర్లుగా మార్చాలని.. ప్రస్తుతం 440 ప్రభుత్వ, 394 ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డిస్పెన్సరీలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. పేషెంట్లు తక్కువగా వస్తున్న డిస్పెన్సరీలను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆయుష్‌ అభివృద్ధికి టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసి పూర్తిస్థాయి నివేదికను తయారుచేయాలని ఆదేశించారు. ఆయుష్‌లోని అన్ని విభాగాల విద్యార్థులూ ఐదేండ్లపాటు చదువుతున్నప్పుడు వారికి గుర్తింపు, గౌరవం దక్కేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నారు.

మెడికల్‌ బోర్డు ద్వారా నియామకాలు

తెలంగాణ వైద్య విధానపరిషత్‌లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీచేయాలని మంత్రి ఈటల ఆదేశించారు. మెడికల్‌బోర్డు ద్వారా ఆర్నెళ్లకోసారి ఖాళీపోస్టుల నియామకాలు చేపట్టేలా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పబ్లిక్‌ హెల్త్‌నుంచి వైద్య విధానపరిషత్‌కు మార్చిన 15 దవాఖానల్లో ఇప్పటికే కొన్నింటి బిల్డింగ్‌లు పూర్తయ్యాయని, వాటిల్లో అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ప్రతి దవాఖానకు అంబులెన్స్‌ఉండాలని, సీటీ స్కాన్‌, పూర్తిల్యాబ్‌లు ఏర్పాటుచేయాలని, అవసరమున్నచోట అన్ని వైద్యపరికరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. సబ్‌సెంటర్‌ నుంచి పీహెచ్‌సీ వరకు అన్నిఖాళీల వివరాలు అందజేయాలని అన్నారు. టైంబౌండ్‌ ప్రమోషన్లకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇన్‌సర్వీస్‌ పీజీచేసిన తర్వాత వారిసేవలు వైద్యవిధానపరిషత్‌, డీఎంఈ దవాఖానల్లో వినియోగించుకోవాలని అన్నారు. ప్రతి  దవాఖానకు మిషన్‌ భగీరథ, కరంట్‌ కనెక్షన్‌ ఉండాలని, అవసరం ఉన్నచోట జనరేటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. 108, 104, 102 వాహనాలు ఎక్కడ అవసరం ఉన్నదో లెక్క తీయాలన్నారు. సమావేశంలో వైద్యరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కమిషనర్‌ వాకాటి కరుణ, ఆయుష్‌ ఇంచార్జి డైరెక్టర్‌ ప్రశాంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్‌ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

దేశమంతా ఒకే వైద్య పాలసీ వద్దు 

వైద్యారోగ్యం రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని, దేశానికంతటికీ ఒకే వైద్యపాలసీ తయారుచేసి రాష్ర్టాల మీద రుద్దొద్దని గతంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి చెప్పినట్టు మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ప్రజలకేమి అవసరమో రాష్ట్రప్రభుత్వాలకు తెలుసునని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ఎంతో ఉపయోగపడ్డాయని అన్నారు. మిషన్‌భగీరథ ద్వారా ఫ్లోరైడ్‌ సమస్య దూరంకావడంతోపాటు, నీటిద్వారా వచ్చే వ్యాధులకు అడ్డుకట్టపడిందని తెలిపారు. కల్యాణలక్ష్మి ద్వారా బాల్యవివాహాలు నిర్మూలించబడి.. అనారోగ్యంతో పిల్లలు పుట్టడం తగ్గిందన్నారు. మిషన్‌కాకతీయ, హరితహారం ప్రజల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చివేసిందని చెప్పారు. 


logo