శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 02:42:33

వ్యాప్తిని అడ్డుకొంటాం

వ్యాప్తిని అడ్డుకొంటాం

  • వ్యాధి నిర్ధారణకు ఆరు ల్యాబ్‌లు
  • ఐదుగురికి మాత్రమే పాజిటివ్‌
  • వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకొంటామని వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌తెలిపారు. ఇప్పటివరకు 66,182 మందికి స్క్రీనింగ్‌ చేయగా ఐదుగురికే కొవిడ్‌-19 పాజిటివ్‌గా  తేలిందని, ఒకరికి నయంచేసి ఇంటికి పంపామని తెలిపారు. ఇండోనేషియా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని ఆరోగ్యశాఖ ప్రకటించింది. గాంధీలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితుల పరిస్థితి మెరుగుపడిందని వెల్లడించింది. మంగళవారం కుటుంబసంక్షేమశాఖ సమావేశ మందిరంలో మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ..  ఇతరదేశాల నుంచి వచ్చినవారికి తప్ప తెలంగాణ గడ్డపై ఉంటున్నవారెవరికీ వైరస్‌ సోకలేదని పునరుద్ఘాటించారు. 

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చినవారికి వ్యాధి లక్షణాలు లేకపోయినా క్వారంటైన్‌చేస్తామని, చైనా, ఇటలీ, ఇరాన్‌, జర్మనీ, కొరియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ దేశాల నుంచి వచ్చినవారినిక్వారంటైన్‌చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 221 మందిని వికారాబాద్‌, దూలపల్లి క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచామని, 1,238 మందిని ఇండ్లల్లోనే క్వారంటైన్‌లో ఉంచినట్టు వివరించారు. విదేశాల నుంచి వచ్చే తెలంగాణవాసులను వారి జిల్లాల్లోనే క్వారంటైన్‌ చేసే ఆలోచన ఉన్నదన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌, మలేసియా, యూకే, పిలిప్పీన్స్‌ నుంచి విమానాలను రద్దుచేశారని, బుధవారంనుంచి మరికొన్ని దేశాలనుంచి వచ్చే విమానాలు రద్దుచేయవచ్చన్నారు.  

ఆరు ల్యాబ్‌లలో నిర్ధారణ పరీక్షలు

కొవిడ్‌-19 వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఆరు ల్యాబ్‌లలో వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నట్టు మంత్రి ఈటల  పేర్కొన్నారు. గాంధీ, ఉస్మానియాలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని, ఫీవర్‌ దవాఖాన, ఐపీఎం, ఎంజీఎం, నిమ్స్‌ దవాఖానలో కూడా ల్యాబ్‌లను సిద్ధంచేస్తున్నట్లు వెల్లడించారు. దూలపల్లి, వికారాబాద్‌ క్వారంటైన్‌ కేంద్రాలకు  సాధారణ వ్యక్తులనే తరలిస్తున్నామని.. విదేశాలనుంచి వచ్చేవారిలో కొందరు ఇంట్లోనే క్వారంటైన్‌ ఉంటామని కోరుతున్నారని, ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. సమావేశంలో కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ జీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌-19 ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఒకరు డిశ్చార్జ్‌ కాగా, ముగ్గురి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, ఇండోనేషియాకు చెందిన వ్యక్తిని ఐసొలేషన్‌లో ఉంచినట్టు తెలిపింది.  

అప్రమత్తమైన పట్టణ స్థానిక సంస్థలు

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కరోనా కట్టడికి పురపాలకశాఖ చర్యలు చేపట్టింది. బస్టాపులు, రైల్వేస్టేషన్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్‌ మా ళ్లలో ప్రచారం నిర్వహించడానికి నోడల్‌ ఆఫీసర్లను నియమించింది. ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంను సిద్ధంచేసింది. కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసును గుర్తిస్తే, చేపట్టాల్సిన చర్యలను నోడల్‌ అధికారులకు నిర్దేశించింది. ప్రార్థనాలయాల్లో కియోస్క్‌లతో అవగాహన కల్పించా లని,అంగన్‌వాడీ కేంద్రాలు, మెప్మా బృందాలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

వారికి పాజిటివ్‌ లేదు

ఇప్పటివరకు 66,182 మందికి శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ నిర్వహించగా ఐదుగురికే కరోనా నిర్ధారణ అయిందని మంత్రి ఈటల అన్నారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు సంబంధించి పలువురిని ట్రాకింగ్‌ చేసి పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. 

ఆరోగ్యశాఖ బులెటిన్‌ వివరాలు

వివరాలు
మంగళవారం ఒక్కరోజు
మొత్తం 
విమానాశ్రయంలో థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు                 
2057
65238
వ్యక్తిగతంగా వచ్చినవారు
68
918
ఇండ్లలో, ఇతరచోట్ల క్వారంటైన్‌లో ఉన్నవారు
662
1530
దవాఖాన ఐసొలేషన్‌లో
40
435
వ్యాధి నిర్ధారణ పరీక్షలు
40
432
నెగెటివ్‌గా నిర్ధారణ
21
397
పాజిటివ్‌గా నిర్ధారణ
15
నిర్ధారణ కావాల్సినవి
1818logo