సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:19

లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌

లక్షణాలు లేకుంటే హోం ఐసొలేషన్‌

  • దవాఖానల్లో కొరత లేకుండా చూసుకోవాలి
  • ఏది అవసరమైనా ఒక్కరోజులో సమకూర్చుతాం
  • వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా పాజిటివ్‌ ఉండి లక్షణాలు లేనివారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. తక్కువ లక్షణాలు ఉన్నవారికి జిల్లా కేంద్ర దవాఖానల్లో, తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మెడికల్‌ కాలేజీల్లో పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని స్పష్టంచేశారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో, జిల్లా ప్రభుత్వ దవాఖానల్లో పాజిటివ్‌ కేసులకు చికిత్స ఇస్తున్న నేపథ్యంలో సూపరింటెండెంట్లతో మంత్రి సోమవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

దవాఖానల్లో ఏమి అవసరం ఉన్నా  ఒక్కరోజులో అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గాంధీలో బాధితులకు నర్సులు అన్నం తినిపిస్తున్నారని, అలాంటి మానవత్వం అందరిలోనూ ఉండాలని, అది గొప్ప పుణ్యకార్యమని చెప్పారు. మహబూబ్‌నగర్‌ సూపరింటెండెంట్‌ దవాఖాన క్వార్టర్స్‌లోనే ఉండి పర్యవేక్షిస్తున్నందుకు ఆయన్ను అభినందించారు. జిల్లాల దవాఖానల సూపరింటెండెంట్లు జిల్లాకేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో వైద్యారోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.


logo